బీమా పాలసీ లో ఈ తప్పులు అస్సలు వద్దు!

పాలసీ పత్రాలను నింపేటప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది

Published : 25 Dec 2020 14:19 IST

కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకునేది బీమా. కానీ, అనుకోని పరిస్థితుల్లో పాలసీని క్లెయిం చేసుకోవాల్సి వస్తే… బీమా సంస్థ దానిని ఆమోదించకుండా… క్లెయింను తిరస్కరిస్తే… ఎంత కష్టం. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే… పాలసీ తీసుకునేప్పుడే జాగ్రత్తగా ఉండాలి. జీవిత బీమా… ఆరోగ్య బీమా… ఏదైనా కానీయండి… కష్టం వచ్చినప్పుడు… ఎలాంటి షరతులూ లేకుండా… ఆర్థికంగా అండగా నిలబడాలి. ఏటా ప్రీమియం చెల్లిస్తూ… అవసరంలో అక్కరకు రాకుంటే ఆ పాలసీలు ఉన్నా లేనట్లే. ఒక పాలసీ తీసుకునేప్పుడు బీమా సంస్థలను ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటామో… పాలసీ పత్రాలను నింపేటప్పుడూ అంతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

తప్పు వివరాలు వద్దు:

ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకునేప్పుడు దానికి సంబంధించిన ప్రీమియాన్ని నిర్ణయించేందుకు మీరు అందించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుంటాయి. తక్కువ ప్రీమియం పడుతుందని కొందరు ఈ వివరాల్లో తప్పుడు సమాచారం ఇస్తుంటారు. పాలసీ ఇచ్చిన తర్వాత… మీరు తెలియజేసిన సమాచారంలో తప్పులు ఉన్నాయని బీమా సంస్థ గుర్తిస్తే ఆ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే… పాలసీ ప్రతిపాదన పత్రాలను పూర్తిగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలి. ఒక్క ఖాళీని కూడా ఉంచకూడదు. మీకు వర్తించకపోతే… ‘ఎన్‌ఏ’ అని రాయాలి. లేదా అక్కడ కొట్టివేయాలి. ప్రతిపాదిత పత్రాన్ని పూర్తి నింపిన తర్వాత దాని ఫొటోలు తీసుకోండి.

  • జీవిత బీమా పాలసీ కోసం ఆదాయ వివరాలు అడిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి, మీకు ఎంత విలువైన పాలసీ ఇవ్వవచ్చనే విషయంలో ఒక అంచనాకు రావడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి, మీ ఆదాయ వివరాలు తప్పుగా పేర్కొనవద్దు. ఇప్పటికే వేరే బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకుంటే ఆ వివరాలూ తెలపండి.

  • ఆర్థిక వివరాలతో పాటు… ఆరోగ్య అలవాట్లనూ పేర్కొనాలి. పొగ తాగడం, మద్యం సేవించడంలాంటి అలవాట్లు ఉంటే… ఆ వివరాలను కచ్చితంగా చెప్పండి. మీ ఎత్తు, బరువు విషయాలనూ తెలియజేయాలి.

ప్రీమియం చెల్లించకుండా…

పాలసీ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే దాని ద్వారా పరిహారం అందుతుంది. పాలసీ తీసుకోవడంతోనే సరిపెట్టకుండా… దానికి సమయం మించి పోకుండా ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ ప్రీమియం చెల్లించకుంటే… పాలసీ రద్దవుతుంది. రద్దయిన పాలసీ ద్వారా క్లెయిం చేసుకోవడం సాధ్యం కాదు. సకాలంలో ప్రీమియం చెల్లించడం పాలసీదారుడిగా మన బాధ్యతే. బీమా సంస్థ ప్రీమియం చెల్లింపునకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటుంది. మీ మొబైల్‌ నెంబరు, ఈమెయిల్‌ మారినప్పుడు ఆ సమాచారాన్ని బీమా సంస్థకు తెలియజేయండి. వీలైనంత వరకూ ప్రీమియం చెల్లింపు కోసం నేరుగా బ్యాంకు ఖాతా నుంచి వెళ్లే ఏర్పాటు చేసుకోండి. గడువు తేదీ నాటికి ప్రీమియం చెల్లించకపోయినా… బీమా సంస్థలు 15-30 రోజులపాటు వ్యవధి ఇస్తుంటాయి. కానీ, ఇది అన్ని సందర్భాల్లో వాడుకోకూడదు. ముఖ్యంగా ఆరోగ్య బీమా విషయంలో ఒక్క రోజు కూడా ఆలస్యం చేయొద్దు.
ముందస్తు వ్యాధులుంటే…

పాలసీ తీసుకోవడం కన్నా ముందే ఏదైనా వ్యాధులుంటే పాలసీ ప్రతిపాదిత పత్రంలో పేర్కొనాలి. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేప్పుడు ఇది తప్పనిసరి. నిర్ణీత వ్యవధి తర్వాత అంటే… పాలసీ నిబంధనలను బట్టి, 3-4 ఏళ్ల తర్వాత ఈ వ్యాధుల చికిత్సకూ పరిహారం వరిస్తుంది. వ్యాధులున్నప్పటికీ… వాటిని దాచిపెట్టి పాలసీ తీసుకుంటేనే ఇబ్బంది వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ప్రీమియం పెరుగుతుందని, లేదా పాలసీ ఇవ్వరనే ఆలోచనతో వీటిని చెప్పకుండా ఉండటం సరికాదు.

బీమా పాలసీ తీసుకునేప్పుడు… వయసు, పాలసీ మొత్తాన్ని బట్టి, ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బీమా సంస్థ సూచించవచ్చు. దీనికి వెనకాడకండి. ఏదైనా సమస్య ఉంటే… ముందుగానే మీ దరఖాస్తును తిరస్కరిస్తాయి బీమా సంస్థలు. తీరా పాలసీ ఇచ్చాక, క్లెయిం ఇవ్వకపోతే వచ్చే ఇబ్బందితో పోలిస్తే ఇదే మేలు.

ఆలస్యం చేస్తే:

బీమా పాలసీని క్లెయిం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడంలో ఆలస్యం చేయకూడదు. పాలసీదారుడు మరణించిన సందర్భంలో క్లెయిం కోసం దరఖాస్తు చేసినప్పుడు బీమా సంస్థలు కొంత ప్రాథమిక సర్వే చేస్తుంటాయి. నామినీ పాలసీ దరఖాస్తు చేయడంలో ఆలస్యం చేస్తే… ఆ క్లెయిం విషయంలో బీమా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తాయి. ఆరోగ్య బీమా విషయంలోనూ అంతే. ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోగా బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయాలి. లేకపోతే పరిహారం ఇవ్వడంలో ఇబ్బంది రావచ్చు. కొన్నిసార్లు ముందుగానే ప్రణాళిక వేసుకొని, ఆసుపత్రిలో చేరవచ్చు. ఇలాంటప్పుడు బీమా సంస్థకు సమాచారం ఇచ్చి, వారి నుంచి అనుమతి వచ్చాకే చికిత్స కోసం వెళ్లాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని