Updated : 05 Jul 2022 12:17 IST

China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్‌ ఎస్టేట్‌ ..!

 ముదురుతోన్న రుణ ఎగవేతలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘‘నాన్‌జింగ్‌లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది’’ అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల గొప్పగా ఓ కథనం రాసింది. దానిలోనే రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు గోధుమలు, అల్లం ఇతర వ్యవసాయోత్పత్తుల రూపంలో చెల్లింపులు స్వీకరిస్తూ ఇళ్లను విక్రయిస్తున్నారని వెల్లడించింది. ఇదంతా రైతులు ఇళ్లు కొనేలా ప్రోత్సహించేందుకు చేస్తున్నట్లు పేర్కొంది. చైనా వాస్తవ పరిస్థితిని కప్పిపెట్టేందుకు గ్లోబల్‌ టైమ్స్‌ వండి వార్చిన కథనం అది. 2008లో అమెరికాలో ‘లేమన్‌ బ్రదర్స్‌’ పతనమైన సమయంలో అక్కడ 6.5 కోట్ల ఇళ్లు ఖాళీగా పడిఉన్నాయి. తాజాగా చైనాలో ఇప్పుడు అటువంటి పరిస్థితే నెలకొన్నట్లు పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. అక్కడి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వరుసగా రుణఎగవేతలకు పాల్పడుతున్నాయి.

తాజాగా షాంఘైకి చెందిన షిమో గ్రూప్‌  బిలియన్‌ డాలర్ల బాండ్లకు వడ్డీ, అసలు చెల్లింపులను ఎగవేసింది. విక్రయాల పరంగా ఈ సంస్థ చైనాలో 14వ అతిపెద్ద రియల్‌ఎస్టేట్‌ కంపెనీ. చైనాలో డాలర్ల చెల్లింపుల్లో జరిగిన అతిపెద్ద ఎగవేతల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు. ఈ సంస్థకు దాదాపు 5.5 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు ఉన్నాయి. ఈ సంస్థ గతంలో ఓ మూసివేసిన క్వారీలో నిర్మించిన ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎవర్‌ గ్రాండే సంక్షోభం, చైనా రియల్‌ ఎస్టేట్‌పై నిబంధనల కొరడా ఝుళిపించడంతో ఈ సంస్థ కూడా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది.

చైనాలోని రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ బయటకు కనిపిస్తున్న దానికంటే ఘోరంగా ఉందని.. భవిష్యత్తులో ఈ రుణ ఎగవేతలు పెరుగుతాయని ఇటీవల గోల్డ్‌మన్‌శాక్స్‌ నివేదిక వెల్లడించింది. చైనాలో ప్రాపర్టీ సెక్టార్‌లోని హైఈల్డ్‌ బాండ్లను జారీ చేసిన 22 సంస్థలు ఈ ఏడాది డాలర్‌ ఆధారిత బాండ్ల చెల్లింపులను ఎగవేయడం కానీ, జాప్యం చేయడం గానీ చేసినట్లు పేర్కొంది. స్టాక్‌ మార్కెట్‌ వలే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంత తేలిగ్గా పుంజుకోదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

బెలూన్‌లా ఉబ్బిపోయిన రియల్‌ మార్కెట్‌..

చైనా అభివృద్ధిలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అత్యంత కీలకమైంది. ముఖ్యంగా షీజిన్‌పింగ్ అధికారం చేపట్టిన నాటి నుంచి మార్కెట్‌ గుర్రంలా దౌడు తీసింది. గత 15 ఏళ్లలో 600శాతం పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి స్పెక్యులేషన్‌ కూడా తోడైంది. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు బాండ్లు జారీ చేస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆశ్రయించడం మొదలుపెట్టాయి. ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన చైనా అధికారులు నిబంధనలు కఠిన తరం చేయడం, కొవిడ్‌-19 వ్యాప్తితో  స్థిరాస్తి మార్కెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మార్కెట్‌లో ఇంత వాపు దేనికి..

1998 వరకూ చైనాలో ప్రైవేటు ఇళ్ల విక్రయాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. దీంతో మూడింట ఒక వంతు మాత్రమే నగరాల్లో ఉండేవారు. కానీ ఆ తర్వాత నిబంధనలు సడలించడంతో రియల్‌ ఎస్టేట్‌ పుంజుకొంది. ఇప్పుడు మూడింట రెండొంతుల మంది నగరాల్లోనే నివసిస్తున్నారు. షెంజన్‌ వంటి నగరాలు లండన్‌, న్యూయార్క్‌లతో పోటీ పడుతున్నాయి. దీంతోపాటు నగరాల్లో స్థానిక సంస్థల ఆర్థిక వృద్ధికి కూడా రియల్‌ ఎస్టేట్‌ పై పన్నులు వంటివి ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. దీంతో బిల్డర్లు కూడా అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా ఈ రంగంలో 2009లో 675 మిలియన్‌ డాలర్ల విదేశీ బాండ్లు ఉండగా.. 2020 నాటికి అవి 64.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మరోవైపు వడ్డీ చెల్లింపుల ఒత్తిడి కూడా పెరిగింది.

చైనా ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం

చైనా జీడీపీలో నాలుగో వంతు రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచే వస్తోంది. తాజాగా ఆ దేశంలోని టాప్‌ 100 డెవలపర్ల విక్రయాలు తొలి నాలుగు నెలల్లో సగానికి పడిపోయాయి. ఈ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం కూడా తగ్గింది. 2021లో నిర్మాణాల్లో ఏకంగా 14శాతం తగ్గుదల నమోదైంది. మిలియన్ల కొద్దీ చదరపు అడుగుల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆరేళ్లలో తొలిసారి గత సెప్టెంబర్‌ నుంచి ఇళ్ల ధరల్లో పతనం మొదలైంది. ఫలితంగా ముందస్తుగానే నిర్మాణాలకు చెల్లింపులు చేసిన వినియోగదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఓ పట్టాన ముందుకు రావడంలేదు. చైనాలోని నగరవాసుల సంపద 70శాతం గృహాలపై పెట్టుబడుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ఆదుకొనేందుకు కేంద్ర బ్యాంక్‌ రంగంలోకి దిగింది. భవిష్యత్తులో షీజిన్‌పింగ్‌ మూడోసారి అధికారం చేపట్టనున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీకి ఇది పెనుసవాలుగా మారింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని