Chip shortage: 2023లోనూ చిప్‌ల కొరత.. కొత్త ఉత్పత్తుల విడుదలలో జాప్యం!

గృహోపకరణాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమపై సెమీకండక్టర్లు, చిప్‌ల కొరత ప్రభావం 2023లోనూ కొనసాగే అవకాశం ఉందని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్

Updated : 26 Sep 2021 23:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహోపకరణాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమపై సెమీకండక్టర్లు, చిప్‌ల కొరత ప్రభావం 2023లోనూ కొనసాగే అవకాశం ఉందని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్‌ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) వెల్లడించింది. కరోనా కారణంగా ఏర్పడిన గడ్డు పరిస్థితుల కారణంగా తయారీదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫలితంగా కొత్త ఉత్పత్తుల విడుదలలోనూ జాప్యం చోటుచేసుకునే ఆస్కారం ఉందని పేర్కొంది. దీంతోపాటు స్టీల్‌, రసాయనాలు, ఇతర ముడి సరకుల రేట్ల పెరుగుదల ప్రభావం ఉత్పత్తుల ధరలపై పడుతోందని సీఈఏఎంఏ అధ్యక్షుడు, గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్ నంది తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న పండగల సీజన్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. డిజైన్ ఆప్టిమైజేషన్, వాల్యూ ఇన్నోవేషన్ తదితర చర్యలతో నష్టాలను తగ్గించుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. 

‘కరోనా పరిస్థితులు, క్రమంగా ముడిసరకుల ధరల పెరుగుదల, రవాణా ఛార్జీలు, మెటీరియల్ కొరత తదితర కారణాలతో 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఉత్పత్తులపై ప్రతి నెలా 3 శాతం ధరలను పెంచుతూ వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ ఈ ప్రభావం కొనసాగింద’ని శుక్లా తెలిపారు. చిప్‌ల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండటంతో 2023లోనూ ఈ సమస్య కొనసాగుతుందని భావిస్తున్నామన్నారు. మరోవైపు చిప్‌ల తయారీదారులూ రేట్లు పెంచుతున్నారని, ఇది భవిష్యత్‌లో ఉత్పత్తుల ధరలు మరింత పెరగడానికి కారణమవుతాయని వివరించారు. సెమీకండక్టర్ పరిశ్రమ సైతం ఈ ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తోంది.. కానీ, సానుకూల ప్రభావాలు రావడానికి రెండు, మూడేళ్ల సమయం పడుతుందన్నారు. మహమ్మారికి ముందు, 2019లో దేశంలో గృహోపకరణాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్ పరిశ్రమ విలువ సుమారు రూ.76,400 కోట్లుగా ఉంది. చిప్‌లు, సెమీకండక్టర్ల కొరతతో వాహన తయారీ రంగం ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని