Home Loan: గృహ రుణాలకు గిరాకీ

అందుబాటు ధరల్లో నివాస గృహాలు లభ్యమవుతుండటం, రుణ రేట్లు తక్కువగా ఉండటంతో  గృహ రుణాలకు గిరాకీ పెరుగుతోందని తనఖా రుణ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, తనఖా సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు కూడా

Updated : 18 Oct 2021 09:20 IST

అందుబాటు ధరల్లో ఇళ్లు

చౌక వడ్డీ రేట్లే కారణం

దిల్లీ: అందుబాటు ధరల్లో నివాస గృహాలు లభ్యమవుతుండటం, రుణ రేట్లు తక్కువగా ఉండటంతో  గృహ రుణాలకు గిరాకీ పెరుగుతోందని తనఖా రుణ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, తనఖా సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు కూడా ఎన్నడూ లేనంతగా అతి తక్కువ రేట్లకే రుణాలు అందిస్తామంటూ ప్రస్తుత పండగ సీజన్‌లో ముందుకొచ్చాయి. కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి తర్వాత ఆర్థిక మందగమనం ఏర్పడటంతో, గృహ రుణాలకు గిరాకీ పెంచేందుకు వీలుగా రుణ రేట్లను తగ్గించాయి. ఈ పండగ సీజన్‌లో ఉత్సాహాన్ని పెంచేందుకు కొన్ని బ్యాంకులు అయితే ఏకంగా 6.5 శాతానికే గృహ రుణాలు అందిస్తుండటం విశేషం.

స్థిరంగా ధరలు
‘గృహాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. స్థిరాస్తి ధరలు దేశ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా పెద్దగా మారలేదు. ఇదే సమయంలో కొన్ని రంగాల్లో వ్యక్తుల ఆదాయాలు బాగా పెరిగాయి. అందువల్ల గృహాలకు భారీగా గిరాకీ పెరుగుతోంది. తక్కువ రుణ రేట్లూ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి.  కొవిడ్‌ తర్వాత ప్రజలు పెద్ద పరిమాణంలో ఉండే అపార్ట్‌మెంట్లకు మారేందుకు ప్రాధాన్యమిస్తున్నార’ని హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేణు సుద్‌ కర్నాడ్‌ వెల్లడించారు.

* ‘ఇప్పటికే నిర్మాణం పూర్తయిన (రెడీమేడ్‌) గృహాలకు గిరాకీ బాగా ఉంది. కొవిడ్‌ టీకాల కార్యక్రమం ఊపందుకోవడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నివాస సముదాయాలను పరిశీలించాకే, కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుబాటు ధరల్లో లభించే గృహాలకు ఈ పండుగ సీజన్‌లో మరింత గిరాకీ పెరుగుతోంద’ని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సీఈఓ, ఎండీ వై.విశ్వనాథ గౌడ్‌ పేర్కొన్నారు.

* ‘చాలా బ్యాంకులు గృహ రుణ రేట్లను తగ్గించాయి. అందుబాటు ధర, మధ్య స్థాయి, ప్రీమియం విభాగాల్లో గృహాలకు గిరాకీ పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది. టెక్నాలజీ రంగంలో వేతనాలు పెరగడం, స్థిరంగా ఉన్న గృహాల ధరలు కూడా ఊతమిస్తున్నాయి. 2021 ఆగస్టు నాటికి వార్షిక ప్రాతిపదికన గృహ రుణాల పంపిణీ 9.2 శాతం పెరిగింది. వచ్చే నెలల్లో ఇది మరింత పెరుగుతుంద’ని ప్రోపర్టీ కన్సల్టెంట్‌ కొల్లియర్స్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ వెల్లడించారు.


బీఓఐ రుణ రేట్ల తగ్గింపు

ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) రుణ రేట్లను తగ్గించింది. గృహ రుణాలపై 35 బేసిస్‌ పాయింట్లు, వాహన రుణాలపై 50 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించింది. ఈ తగ్గింపు తర్వాత గృహ రుణాలు 6.5 శాతానికి, వాహన రుణాలు 6.85 శాతానికి దిగి వచ్చాయి. ఈ ప్రత్యేక రుణ రేట్లు ఈ నెల 18 నుంచి డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటాయి. కొత్తగా రుణాలు తీసుకునే వారితోపాటు వేరే బ్యాంకుల నుంచి రుణాలు బదిలీ చేసుకునే వారికి కూడా ఈ రుణ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్‌ పేర్కొంది. డిసెంబరు 31 వరకు తీసుకునే గృహ, వాహన రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని