సంక్షిప్త వార్తలు(7)

కోల్‌ ఇండియాలో 3 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.4,185 కోట్లు సమీకరించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో వాటా విక్రయం ద్వారా కంపెనీలో ప్రభుత్వ వాటా 63.13 శాతానికి తగ్గిందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

Published : 06 Jun 2023 01:44 IST

కోల్‌ ఇండియా వాటా విక్రయంతో ప్రభుత్వానికి రూ.4,185 కోట్లు

దిల్లీ: కోల్‌ ఇండియాలో 3 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.4,185 కోట్లు సమీకరించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో వాటా విక్రయం ద్వారా కంపెనీలో ప్రభుత్వ వాటా 63.13 శాతానికి తగ్గిందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కోల్‌ ఇండియాలో వాటా విక్రయానికి ప్రభుత్వానికి రూ.4,185 కోట్లు లభించాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) వెల్లడించింది. గత వారం కోల్‌ ఇండియా చేపట్టిన వాటా విక్రయానికి రిటైల్‌, సంస్థాగత మదుపర్ల నుంచి అధిక స్పందన లభించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వాటా విక్రయాల ద్వారా రూ.4,235 కోట్లు కూడగట్టింది.


విప్రో రూ.12,000 కోట్లషేర్ల బైబ్యాక్‌కు వాటాదార్ల ఆమోదం

దిల్లీ: రూ.12,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు)కు వాటాదార్లు ఆమోదం తెలిపినట్లు ఐటీ సంస్థ విప్రో సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. విప్రో బోర్డు 26.96 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.445 చొప్పున బైబ్యాక్‌ చేసేందుకు ఆమోదించిన సంగతి తెలిసిందే. పోస్టల్‌ బ్యాలెట్‌, ఇ-ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా నిర్వహించిన ప్రత్యేక తీర్మానంలో 99.9 శాతం మంది వాటాదార్లు షేర్ల బైబ్యాక్‌కు అనుకూలంగా ఓటేశారని విప్రో తెలిపింది.


రూ.3,500 కోట్ల సమీకరణలో ‘బ్రూక్‌ఫీల్డ్‌’

దిల్లీ: సంస్థాగత మదుపర్లకు యూనిట్ల జారీ లేదా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా రూ.3,500 కోట్ల వరకు నిధులు సమీకరించే ప్రణాళికలో బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ట్రస్ట్‌ (బీఐఆర్‌ఈటీ) ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత 2 వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు సమాచారం. గత నెలలో బీఐఆర్‌ఈటీ, సింగపూర్‌కు చెందిన సార్వభౌమ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ సమాన భాగస్వామ్యంతో 2 వాణిజ్య ఆస్తులను రూ.11,225 కోట్లతో భారత్‌లో కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  


లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ 24/7 హెల్ప్‌లైన్‌

చెన్నై: బీమా సేవల సంస్థ లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు బీమా క్లెయిమ్‌ల సేవలు అందించేందుకు 24/7 హెల్ప్‌లైన్‌ను సోమవారం ప్రారంభించింది. ఐఆర్‌సీటీసీ రైలు ప్రయాణికులకు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వ్యక్తిగత ప్రమాద కవరేజీని అందిస్తోంది. బాధిత కుటుంబాల వారు +91 93249 68286 నంబరుకు ఫోన్‌ చేసి సేవలు పొందవచ్చని కంపెనీ సీఈఓ, పూర్తి కాల డైరెక్టర్‌ రూపమ్‌ ఆస్థానా వెల్లడించారు.

* ఎస్‌బీఐ లైఫ్‌తో పాటు పలు బీమా సంస్థలు ఒడిశా రైలు ప్రమాద బాధితుల బీమా క్లెయిమ్‌లను ప్రాధాన్య క్రమంలో సెటిల్‌మెంట్‌ చేసి ఆ కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు ముందుకొచ్చాయి. హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి క్లెయిమ్‌ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ తపన్‌ సింఘేల్‌ వెల్లడించారు.


వినియోగ వాహన వ్యాపారంలోకి దైమ్లర్‌

చెన్నై: వినియోగ వాహన వ్యాపార విభాగంలో వాణిజ్య వాహన తయారీ సంస్థ దైమ్లర్‌ ఇండియా అడుగుపెట్టింది. ఇందులో భాగంగా సరికొత్త బ్రాండ్‌ ‘భారత్‌ బెంజ్‌ సర్టిఫైడ్‌’ను ప్రారంభించింది. జర్మనీ సంస్థ దైమ్లర్‌ ట్రక్‌ ఏజీకి దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. తాజా వ్యాపార విభాగం వినియోగించిన భారత్‌ బెంజ్‌ ట్రక్కులను రిఫర్బిష్‌ చేసి వినియోగదారులకు విక్రయించనుంది. ముందుగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించగా.. భారత్‌బెంజ్‌ సర్టిఫైడ్‌ కార్యక్రమాన్ని దేశంలోని ఇతర డీలర్‌షిప్‌లకు విస్తరించారు.


స్వల్పంగా తగ్గిన సేవల రంగం

దిల్లీ: భారత సేవల రంగ వృద్ధి మే నెలలో స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్‌లో ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ 62 పాయింట్లు కాగా, మేలో 61.2 పాయింట్లకు పరిమితమైంది. ఏప్రిల్‌తో పోల్చితే తగ్గినా, 2010 జులై నుంచి రెండో అతి వేగవంతమైన వృద్ధి ఇదే కావడం విశేషం. అనుకూల గిరాకీ పరిస్థితులు, కొత్త క్లయింట్ల నుంచి ఆర్డర్లు గెలుచుకోవడం సేవల రంగ వృద్ధికి దోహదం చేశాయి. గత 22 నెలలుగా పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) 50 పాయింట్ల పైనే నమోదవుతూ వస్తోంది. పీఎంఐ 50 పాయింట్ల కింద నమోదైతే క్షీణతగా, పైన నమోదైతే వృద్ధిగా పరిగణిస్తారు.


నమోదిత కంపెనీలు రూ.63,300 కోట్లు సమీకరించాయ్‌

దిల్లీ: వ్యాపార విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధుల కోసం ఏప్రిల్‌లో స్టాక్‌ మార్కెట్‌ నుంచి నమోదిత కంపెనీలు దాదాపు రూ.63,300 కోట్లు సమీకరించాయి. నిధుల సమీకరణకు కంపెనీలు ఎక్కువగా రుణాల పద్ధతిని ఎంచుకున్నాయి. రుణాల చెల్లింపు, కొత్త ప్రాజెక్టుల కోసం మూలధన వ్యయాలు, ఇతర సంస్థల కొనుగోళ్లు, మార్కెటింగ్‌, ఆర్‌ అండ్‌ డీ వంటి వాటి కోసం కంపెనీలు నిధులు సమీకరిస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు వెల్లడించారు. ఏప్రిల్‌లో మొత్తం రూ.63,278 కోట్లు సమీకరించగా.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.55,462 కోట్లు, ఈక్విటీ మార్కెట్‌ నుంచి మిగిలిన రూ.7,816 కోట్లు సమీకరించినట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో కంపెనీలు ఈక్విటీల నుంచి రూ.19,588 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.14,750 కోట్లు సమీకరించాయి. డెట్‌ మార్కెట్‌ నుంచి వసూలు చేసిన రూ.55,462 కోట్లలో.. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.53,426 కోట్లు, పబ్లిక్‌ ఇష్యూయెన్స్‌ ద్వారా రూ.2,036 కోట్లు వచ్చాయి.


సంక్షిప్తంగా..

* పింఛనుదార్లు లైఫ్‌ సర్టిఫికెట్లను సమర్పించే వెసులుబాటు, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్‌ సహా మరణించిన ఖాతాదార్ల వారసులకు ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ వంటి వినియోగదారు ఆధారిత సేవలను బ్యాంకులు ప్రారంభించాలని ఆర్‌బీఐ నియమించిన ప్యానెల్‌ సిఫారసు చేసింది.

* బెంగళూరులో మైసూర్‌ రోడ్డులోని గ్లోబల్‌ మాల్‌లో కొత్తగా 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రీమియం సినిమా ఎగ్జిబిటర్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ సోమవారం వెల్లడించింది.

* రాజస్థాన్‌లోని బికనేర్‌లో 110 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభించినట్లు టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేస్తున్న హరిత విద్యుత్‌ను కేరళ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (కేఎస్‌ఈబీ)కి సరఫరా చేయనున్నట్లు టాటా పవర్‌ పేర్కొంది.

* వాడియా గ్రూప్‌ సంస్థ గో ఫస్ట్‌ నుంచి తమ విమానాలు, ఇంజిన్లను వెనక్కి కోరుతూ ముగ్గురు లీజుదార్లు దాఖలు చేసిన పిటిషన్లపై వారంలో తాత్కాలిక పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ) కౌంటర్‌ దాఖలు చేయాలని దివాలా ట్రైబ్యునల్‌ ఎన్‌సీఎల్‌టీ వెల్లడించింది.

* యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ)ను వినియోగించి ఏటీఎంల్లో నగదు ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రారంభించినట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సోమవారం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని