ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ విలీనం!

పూర్తిగా షేర్ల లావాదేవీ ద్వారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో, మాతృసంస్థ ఐడీఎఫ్‌సీ ని విలీనం చేసే ప్రతిపాదనకు సోమవారం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు.

Updated : 04 Jul 2023 12:47 IST

ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యే అవకాశం
ప్రతీ 100 ఐడీఎఫ్‌సీ షేర్లకు 155 ఫస్ట్‌ షేర్లు

ముంబయి: పూర్తిగా షేర్ల లావాదేవీ ద్వారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో, మాతృసంస్థ ఐడీఎఫ్‌సీ ని విలీనం చేసే ప్రతిపాదనకు సోమవారం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో దాని మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అయిన కొద్ది రోజులకే అదే తరహాలో ఇది చోటు చేసుకోనుంది. విలీన సంస్థ విలువను బ్యాంకు చెప్పలేదు. అయితే సోమవారం బీఎస్‌ఈలో ఇరు కంపెనీల షేర్ల ముగింపు ధరలను బట్టి సంయుక్త సంస్థ విలువ రూ.71,767 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఐడీఎఫ్‌సీతో పాటు ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కూడా బ్యాంకులో విలీనం అవుతుంది.

20 శాతం ప్రీమియంతో..

విలీన నిష్పత్తిని 155:100గా నిర్ణయించారు. అంటే ప్రతి 100 ఐడీఎఫ్‌సీ షేర్లకు 155 ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు లభిస్తాయి. 2023 జూన్‌ 30 నాటి ఇరు సంస్థల షేర్ల ముగింపు ధరతో పోలిస్తే 20 శాతం ప్రీమియంకు షేర్ల మార్పిడి నిష్పత్తి ఉన్నట్లు తెలుస్తోంది.

మార్కెట్‌ విలువ ఎంతంటే..

ఈ విలీనం అనంతరం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ బుక్‌ విలువ ఒక్కో షేరుకు 4.9% పెరుగుతుంది. 2023 జూన్‌ 30 నాటికి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీకి 39.93% వాటా ఉంది. సోమవారం బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ స్క్రిప్‌ 3% పెరిగి రూ.81.7 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.54,311.48 కోట్లుగా నమోదైంది. ఐడీఎఫ్‌సీ షేరు 7% లాభంతో రూ.110 వద్ద స్థిరపడడంతో.. మార్కెట్‌ విలువ రూ.17,456 కోట్లకు చేరింది. మొత్తం మీద ఇరు కంపెనీల సంయుక్త మార్కెట్‌ విలువ రూ.71,767 కోట్లకు చేరినట్లయింది.

ప్రమోటర్ల వాటా లేని సంస్థగా..

‘ఈ విలీనం వల్ల ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్‌, ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ల కార్పొరేట్‌ నిర్మాణం సరళీకృతమవుతుంది. ఇవన్నీ ఒకే సంస్థగా మారడం వల్ల నియంత్రణపరమైన నిబంధనలను పాటించడం సులువవుతుంది. ఈ విలీనం వల్ల ఇతర భారీ స్థాయి ప్రైవేటు రంగ బ్యాంకుల్లాగే.. ప్రజలు, సంస్థలు వాటాదార్లుగా ఉన్న సంస్థగా, ప్రమోటర్ల వాటా లేని సంస్థగా ఎదగడానికి వీలవుతుంద’ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేర్కొంది. ‘అనుకోని పరిస్థితులు ఎదురైతే మినహా.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే విలీనాన్ని పూర్తి చేయనున్న’ట్లు తెలిపింది. ఇక దీర్ఘకాల దృక్పథంతో తదుపరి దశ వృద్ధి దిశగా అడుగులు పడతాయని బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ సంజీబ్‌ ఛౌధురి పేర్కొన్నారు.

ఇలా ఏర్పడ్డాయ్‌..

1997లో ఒక మౌలిక రుణదాతగా ఐడీఎఫ్‌సీ ఏర్పాటైంది. 2014 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ ఇచ్చిన అనుమతులతో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్యకలాపాలను 2015 అక్టోబరులో ఐడీఎఫ్‌సీ ప్రారంభించారు. ఆ సమయంలో ఐడీఎఫ్‌సీకి చెందిన రుణ ఆస్తులు బ్యాంకుకు తరలించారు. 2018 డిసెంబరు 18న క్యాపిటల్‌ ఫస్ట్‌ను ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం చేసి,  ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా నామకరణం చేశారు. అప్పటి నుంచి బ్యాంకు తన డిపాజిట్‌ ఫ్రాంఛైజీని ఏటా 36% వృద్ధితో రూ.1,36,812 కోట్లకు చేర్చింది. ప్రస్తుతం 809 శాఖలు, 925 ఏటీఎంలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని