కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలు

కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఉత్పాదకతతో పాటు ఉద్యోగావకాశాలలూ పెరుగుతాయని.. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ కంపెనీల అధిపతులు సూచించారు.

Published : 26 Aug 2023 03:14 IST

బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి
అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల అధిపతులు
బీ20 సమిట్‌ ఇండియా

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఉత్పాదకతతో పాటు ఉద్యోగావకాశాలలూ పెరుగుతాయని.. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ కంపెనీల అధిపతులు సూచించారు. ఏఐ వల్ల ప్రయోజనాలు, నష్టభయాలపై సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ‘బీ20 సమిట్‌ ఇండియా 2023’లో వారేమన్నారంటే..

వ్యయాలు తగ్గుతాయి: ఐబీఎమ్‌‘ఏఐ వల్ల వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. కోడింగ్‌ 60% మెరుగుపడుతుంది. ఐబీఎమ్‌ విషయానికే వస్తే, మా మొత్తం కార్యకలాపాల్లో 20% తక్కువ స్థాయి అవగాహనతో చేసే పని ఉంటుంది. ఇందులో 30 శాతాన్ని ఏఐ ద్వారా చేయగలుగుతున్నాం. దీంతో క్లయింట్లకు తక్కువ వ్యయాలతో పని పూర్తి చేయొచ్చు. ఈ విభాగాల్లోని ఉద్యోగులను ఇతర పనులకు వినియోగించుకోవచ్చు. ఇప్పుడైనా,  భవిష్యత్‌లోనూ.. అధిక అవగాహనతో చేసే పనులను మానవులే చేయాల’ని ఐబీఎమ్‌ ఛైర్మన్‌, సీఈఓ అరవింద్‌ కృష్ణ పేర్కొన్నారు.

ఆ రెండింటికి పరిష్కారం ఒక్కటే: టీసీఎస్‌ ‘గత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ మార్పు కనిపించింది. తదుపరి ఏఐ వంతు వచ్చింది. మనదేశంతో పాటు ప్రపంచ దక్షిణ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న ప్రజలకు సేవలు అందించడంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. 30 కోట్ల మందికి ఆరోగ్య సంరక్షణ, విద్యా సేవలు అందడం లేదు. కొన్నేళ్ల క్రితం బ్యాంకింగ్‌ సేవలూ అందుబాటులో ఉండేవి కాదు. మరో వైపు ఏటా 1-1.2 కోట్ల మంది ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సమస్యలనూ తీర్చాలంటే.. సాంకేతికతను ముఖ్యంగా ఏఐను అందిపుచ్చుకోవాల్సిందే’నని టీసీఎస్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ‘తక్కువ నైపుణ్యం ఉన్నవారు కూడా ఏఐతో అద్భుత నిపుణులుగా మారగలరు. భారత్‌లో మరిన్ని ఉద్యోగాలకు ఏఐ దోహదం చేయగలద’ని ఆయన వివరించారు.

అద్భుత అవకాశాలు: అడోబ్‌, మైక్రోసాఫ్ట్‌, మాస్టర్‌ కార్డ్‌ ప్రపంచవ్యాప్త డిజిటల్‌ చెల్లింపుల్లో 46% వాటా, 100 కోట్ల ఆధార్‌ కార్డులు, 85 కోట్ల స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వినియోగదార్లున్న భారత్‌కు ఏఐలో భారీ అవకాశాలున్నాయని అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ అన్నారు. ‘నష్టాలను ఆలోచించకుండా..సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ తప్పులను ఏఐ అభివృద్ధిలో పునరావృతం చేయొద్దని చాలా మంది అంటున్నార’ని మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌, వైస్‌ ఛైర్మన్‌ బ్రాడ్‌ స్మిత్‌ పేర్కొన్నారు. ‘జెనరేటివ్‌ ఏఐ ‘అద్భుత అవకాశాల’ను అందిస్తోంది. అయితే కంపెనీలు తమ సామర్థ్యాన్ని వెలికితీసే క్రమంలో స్వయం నియంత్రణ పాటించాలి. పారదర్శకత, గోప్యత-భద్రత, బాధ్యత, సమగ్రత.. ఈ నాలుగు సూత్రాలను పాటించాల’ని మాస్టర్‌కార్డ్‌ సీఈఓ మైఖేల్‌ మేబాక్‌ సూచించారు.

  • వచ్చే 7-10 ఏళ్లలో అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రపంచ దేశాలకు 4.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని బీ20 ఇండియా టాస్క్‌ ఫోర్స్‌(ఫైనాన్సింగ్‌ అండ్‌ గ్లోబల్‌ ఎకనమ్‌ రికవరీ) ఛైర్‌పర్సన్‌ ఉదయ్‌ కోటక్‌ అంచనా వేశారు.
  • జీ20 దేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు సులువుగా రుణ సదుపాయాలను కల్పిస్తేనే.. డిజిటల్‌ మార్పును తీసుకురావడంతో పాటు, సైబర్‌ భద్రతను పెంపొందించుకోగలవని బీ20 ఇండియా టాస్క్‌ ఫోర్స్‌(డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) సహ-ఛైర్మన్‌ రాజేశ్‌ గోపీనాథన్‌ సిఫారసు చేశారు.
  • భారత్‌లో అంతర్జాతీయ తయారీని బలోపేతం చేసేందుకు గొప్ప అవకాశాలు ఉన్నాయని ఫెడెక్స్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ రాజ్‌ సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు. టారిఫేతర అవరోధాలను తగ్గించడంతో, వస్తువులు సరిహద్దుల్లో సులువుగా వెళ్లేలా హేతుబద్ధీకరించాలని భారత్‌ను ఆయన కోరారు.

ఆహార కొరతకు ఆఫ్రికా పరిష్కారం : సునీల్‌ మిత్తల్‌

దిల్లీ: ఆఫ్రికాలో వ్యవసాయ యోగ్యమైన, సాగు చేయకుండా ఉన్న సారవంతమైన నేలను సద్వినియోగం చేసుకుంటే.. ప్రపంచ ఆహార సంక్షోభానికి పరిష్కారం చూపొచ్చని బీ20 ఇండియా యాక్షన్‌ కౌన్సిల్‌(ఆఫ్రికన్‌ ఎకనామిక్‌ ఇంటిగ్రేషన్‌) ఛైర్‌పర్సన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమిలో 60% ఆఫ్రికాలోనే ఉంది. అందులో 5-10% భూమిని సాగులోకి తెచ్చినా ప్రపంచ ఆహార వ్యవస్థలో పెనుమార్పు తీసుకురావొచ్చ’న్నారు. ‘ఆఫ్రికా ఎకనామిక్‌ ఇంటిగ్రేషన్‌’ ఇపుడిపుడే పుంజుకుంటోంది. ఆఫ్రికా యూనియన్‌కు త్వరలోనే జీ20లో శాశ్వత సభ్యత్వం రావొచ్చని ఆయన అన్నారు. జీ20లో ఆఫ్రికా స్వరం ‘అత్యంత ముఖ్యమైనద’ని పేర్కొన్నారు.


దేశీయ విపణిపై ఎంబ్రాయర్‌ ఆసక్తి

విమానయాన పరిశ్రమను బలోపేతం చేయడం కోసం భారత్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని బ్రెజిల్‌ విమానయాన సంస్థ ఎంబ్రాయర్‌ భావిస్తోంది. కరోనా వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు ఎదురైన సవాళ్లు, ఇపుడు కొత్త భాగస్వామ్యాలకు అవకాశాన్ని కల్పిస్తున్నాయని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ ఫ్రాన్సిస్కో గోమ్స్‌ నీటో తెలిపారు. భారత్‌లో తక్కువ వేతనాలకే నిపుణులు లభించడాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు.


ద్రవ్యోల్బణంపైనే మా దృష్టి : ఆర్థిక మంత్రి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి బాగుంటుందని..15 నెలల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘చాలా వరకు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న సమస్యేమిటంటే.. సరఫరా వ్యవస్థలో సవాళ్లను పరిష్కరించకుండా.. ద్రవ్యోల్బణ అదుపునకు వడ్డీ రేటునే ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. ఇది పూర్తి పరిష్కారాన్ని అందించలేద’ని ఆమె బి-20 సమావేశంలో అన్నారు. భారత్‌లో ప్రభుత్వ మూలధన వ్యయం పెరిగే సరికి ప్రైవేటు రంగ పెట్టుబడులు కూడా రాణిస్తున్నాయన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌పై దృష్టి కొనసాగుతుందని.. అయితే అవసరమైన దిగుమతులను ఆపబోమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని