మరో 2 నెలలు టొమాటో ధరల వాత: క్రిసిల్‌

అస్థిర, అధిక వర్షాల వల్ల దిగుబడులు తగ్గడం వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయని క్రిసిల్‌ రీసెర్చ్‌ శుక్రవారం వెల్లడించింది. టొమాటో ధరలు ఈనెల 25 నాటికి 142 శాతం పెరిగిందని

Updated : 27 Nov 2021 09:39 IST

ముంబయి: అస్థిర, అధిక వర్షాల వల్ల దిగుబడులు తగ్గడం వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయని క్రిసిల్‌ రీసెర్చ్‌ శుక్రవారం వెల్లడించింది. టొమాటో ధరలు ఈనెల 25 నాటికి 142 శాతం పెరిగిందని, మరో 2 నెలలు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అంచనా వేసింది. అత్యధికంగా టొమాటోను పండించే కర్ణాటకలో దిగుబడి తగ్గడంతో, మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతోందని పేర్కొంది. సాధారణం కంటే 105 శాతం అధికంగా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లో 40 శాతం అధికంగా, మహారాష్ట్రలో 22 శాతం ఎక్కువగా వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతిన్నాయని తెలిపింది.  సాధారణంగా అక్టోబరు-డిసెంబరులో ఈ రాష్ట్రాల నుంచే టొమాటో అధికంగా సరఫరా అవుతుందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో వేసిన పంట మార్కెట్‌లోకి రావడానికి జనవరి అవుతుందని, అప్పటి వరకు ధర ఎక్కువగానే ఉండొచ్చని అభిప్రాయపడింది. ఉల్లిపాయలకొస్తే మహారాష్ట్రలో గత ఆగస్టులో తక్కువ వర్షాలతో రైతులు పంట ఆలస్యంగా వేశారని, అందుకే వీటి ధరలు సెప్టెంబరుతో పోలిస్తే ప్రస్తుతం 65 శాతం ఎక్కువగా ఉన్నాయని క్రిసిల్‌ తెలిపింది. హరియాణా నుంచి 10-15 రోజుల్లో తాజా ఉల్లిగడ్డలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉండటంతో ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాదుంపలను పండించే ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, గుజరాత్‌లలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో వీటి ధరలు కూడా వచ్చే 2 నెలలు అధికంగానే ఉండొచ్చని అంచనా వేసింది. బెండకాయల ధరలు వచ్చే 3 వారాల్లో తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇతర కూరగాయలైన కాప్సికమ్‌, దోసకాయ తదితర ఉత్పత్తి కూడా రబీ సీజన్‌లో బాగా తగ్గిందని క్రిసిల్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని