బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 9.8 శాతానికి!

ఈ ఏడాది మార్చి ఆఖరుకు 7.48 శాతంగా ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) వచ్చే మార్చికి 9.80 శాతానికి పెరగొచ్చని కేంద్ర ఆర్థికశా.....

Updated : 07 Dec 2021 05:25 IST

ఈనాడు, దిల్లీ: ఈ ఏడాది మార్చి ఆఖరుకు 7.48 శాతంగా ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) వచ్చే మార్చికి 9.80 శాతానికి పెరగొచ్చని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. ఒత్తిడికి గురవుతున్న రుణాలను పారదర్శకంగా గుర్తించడం వల్లే వాటి పరిమాణం 2015 మార్చి 31 నాటి రూ.3,23,464 కోట్ల నుంచి 2018 మార్చి 31కి రూ.10,36,187 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2019 మార్చి 31కి రూ.9,33,779 కోట్లుగా ఉన్న ఇవి 2020 మార్చి 31కి రూ.8,96,082 కోట్లకు, 2021 మార్చికి రూ.8,35,051 కోట్లకు తగ్గినట్లు తెలిపారు. అమెరికా, చైనా, జపాన్‌ల కంటే ఒత్తిడికి గురవుతున్న ఆస్తులు మన బ్యాంకుల్లోనే చాలా అధికమని వెల్లడించారు.

ప్రపంచ అగ్రశ్రేణి-100 బ్యాంకుల్లో ఎస్‌బీఐకి చోటు: ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణి 100 బ్యాంకుల్లో భారత్‌ నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చోటు దక్కినట్లు భగవత్‌ కరాడ్‌ తెలిపారు. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ గ్లోబల్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం అగ్రశ్రేణి-100 బ్యాంకుల్లో అమెరికా నుంచి 11, చైనా నుంచి 19, జపాన్‌ నుంచి 8 బ్యాంకులు చోటు దక్కించుకున్నాయి.


గ్రీన్‌ మొబిలిటీ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌ విజేతల్లో రేస్‌ ఎనర్జీ

దిల్లీ: గ్రీన్‌ మొబిలిటీ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణకు చెందిన రేస్‌ ఎనర్జీ సహా 5 సంస్థలు విజేతలుగా నిలిచాయని ఉబర్‌ సోమవారం ప్రకటించింది. దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచేందుకు ఆలోచనలు అందించాలని ఈ ఛాలెంజ్‌లో కోరగా 150కి పైగా ఇన్నొవేటర్లు, అంకుర సంస్థలు పాల్గొన్నాయి. రేస్‌ ఎనర్జీ సహా బాడీక్యాస్ట్‌ ఇన్నొవేటర్స్‌ ప్రై.లి, వీర్య బ్యాటరీస్‌ ప్రై.లి., కాజమ్‌ ఈవీ టెక్‌ ప్రై.లి, ఎమురాన్‌ టెక్నాలజీస్‌ విజేతలుగా నిలిచాయి. స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ఐక్రియేట్‌, స్టార్టప్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ ఛాలెంజ్‌లో విజేతలుగా నిలిచిన ఈ సంస్థలకు రూ.75 లక్షల గ్రాంట్‌ను ఉబర్‌ అందించనుంది. 6 నెలల పాటు ఐక్రియేట్‌లో బిజినెస్‌ ఇంక్యుబేషన్‌కు అవకాశం కల్పించారు. రన్నరప్‌లకు కూడా 2 నెలల ఇంక్యుబేషన్‌ సహా ఉబర్‌ లీడర్లతో మెంటార్‌షిప్‌, ఐక్రియేట్‌లో కో-వర్కింగ్‌ స్థల అవకాశం కల్పిస్తున్నామని ఉబర్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని