61 కంపెనీలు.. రూ.52,759 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా 61 కంపెనీలు మొత్తంగా రూ.52,759 కోట్లు సమీకరించాయి. వీటిల్లో 34 చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎమ్‌ఈలు) విభాగానికి చెందినవని....

Updated : 07 Dec 2021 05:27 IST

2021-22లో అక్టోబరు వరకు ఐపీఓల ద్వారా సమీకరణ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా 61 కంపెనీలు మొత్తంగా రూ.52,759 కోట్లు సమీకరించాయి. వీటిల్లో 34 చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎమ్‌ఈలు) విభాగానికి చెందినవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు. తయారీ, సేవల రంగం నుంచే ఎక్కువ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయని ఆమె వివరించారు. గత ఆర్థిక సంవత్సరం 56 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల్లో రూ.31,060 కోట్లు సమీకరించాయని, వీటిల్లో 27 ఎస్‌ఎమ్‌ఈలని అన్నారు. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌తో మదుపర్లు ఇబ్బందులు పడ్డారా అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, ఇష్యూకు అధిక స్పందనే వచ్చిందని గుర్తు చేశారు. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంల మౌలిక వసతుల బలోపేతానికి పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  

శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ ఇష్యూ రేపటినుంచి

ఈనెల 8న ప్రారంభం కానున్న శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు రూ.113-118ను ధరల శ్రేణిగా నిర్ణయించారు. ఈ ఇష్యూ 10న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో కంపెనీ ఉద్యోగులకు రూ.3 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. వీళ్లకు ఒక్కో షేరుపై తుది ఇష్యూ ధరలో రూ.11 తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. చిన్న మదుపర్లకు 10 శాతం షేర్లను అట్టేపెట్టారు. మదుపర్లు కనిష్ఠంగా 125 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.

క్వాల్‌కామ్‌కు 20 రెట్ల ప్రతిఫలం!

మ్యాప్‌మై ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా చిప్‌ల తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌కు సుమారు 20 రెట్ల ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. ఈ సంస్థలో తనకున్న 5 శాతం వాటాను క్వాల్‌కామ్‌ విక్రయించనుంది. ఈ వాటాల కొనుగోలు కోసం అప్పట్లో సగటున ఒక్కో షేరుకు రూ.52 చొప్పున క్వాల్‌కామ్‌ వెచ్చించింది. ఇప్పుడు మ్యాప్‌మై ఇండియా ఇష్యూ కోసం నిర్ణయించిన ధరల శ్రేణి రూ.1,000- 1,033 ప్రకారం చూస్తే క్వాల్‌కామ్‌ పెట్టుబడి విలువ ఇంచుమించు 20 రెట్లు పెరిగినట్లుగా అనుకోవచ్చు.


* దేశంలో ఏటీఎంలు 2.13 లక్షలు: సెప్టెంబరు చివరినాటికి దేశవ్యాప్తంగా 2,13,145 ఏటీఎంలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ పార్లమెంటుకు తెలిపారు. ఇందులో 47 శాతానికి పైగా ఏటీఎంలు గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని లోక్‌సభకు ఆయన తెలియజేశారు. వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు  27,387 వరకు ఉంటాయని పేర్కొన్నారు.

* జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో సగానికి పైగా మహిళలవే: ప్రస్తుత సంవత్సరం నవంబరు 17 నాటికి దేశవ్యాప్తంగా ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన ఖాతాల సంఖ్య 43.90 కోట్లుగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇందులో 24.42 కోట్లు అంటే 55.60 శాతం ఖాతాలు మహిళలవేనని పేర్కొన్నారు.  

* విమానయాన సంస్థల నష్టం రూ.19,564 కోట్లు: గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) విమానయాన సంస్థలు రూ.19,564 కోట్లు, విమానాశ్రయాలు రూ.5,116 కోట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయని రాజ్యసభకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌ తెలిపారు. కొవిడ్‌-19 పరిణామాలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు.

* రూ.58,500 కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ: సూక్ష్మ, చిన్న, మధ్య సంస్థలకు చెందిన 9.8 లక్షల రుణ ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) పునర్‌వ్యవస్థీకరించాయి. ఈ రుణ ఖాతాల విలువ రూ.58,524 కోట్ల వరకు ఉంటుందని లోక్‌సభకు ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా తెలిపింది. అలాగే వ్యక్తులకు సంబంధించి 8.5 లక్షల ఖాతాలకు చెందిన రూ.60,000 కోట్ల రుణాలను పునర్‌వ్యవస్థీకరించాయని పేర్కొంది. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తులు, ఎంఎస్‌ఎమ్‌ఈ సంస్థలకు రుణాల చెల్లింపుల్లో వెసులుబాటు ఇచ్చేందుకు ఆరు నెలల పాటు మారటోరియం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ అవకాశాన్ని ఆర్‌బీఐ, ప్రభుత్వం కల్పించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని