లారస్‌ ల్యాబ్స్‌కు రూ.154 కోట్ల లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి లారస్‌ ల్యాబ్స్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. త్రైమాసిక ఆదాయం రూ.1,029 కోట్లు, నికరలాభం రూ.154 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. క్రితం ఆర్థిక

Published : 28 Jan 2022 03:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి లారస్‌ ల్యాబ్స్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. త్రైమాసిక ఆదాయం రూ.1,029 కోట్లు, నికరలాభం రూ.154 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,288 కోట్లు, నికరలాభం రూ.273 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 20 శాతం, నికరలాభం 44 శాతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర  రెండో త్రైమాసిక ఫలితాలతో పోల్చినా ఆదాయం 14 శాతం, నికరలాభం 24 శాతం క్షీణించింది.  ఏఆర్వీ ఏపీఐ (యాంటీ రెట్రోవైరల్‌ యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) విభాగంలో అమ్మకాలు తగ్గడం లారస్‌ ల్యాబ్స్‌ త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపింది. అదే సమయంలో ఇతర ఏపీఐ ఔషధాల విభాగంలో 38 శాతం, సింథసిస్‌ వ్యాపారంలో 63 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

9 నెలలకు: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి లారస్‌ ల్యాబ్స్‌ రూ.3,511 కోట్ల ఆదాయాన్ని, రూ.597 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఈపీఎస్‌ రూ.11.1 ఉంది, 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ,3,401 కోట్లు, నికరలాభం రూ.687 కోట్లు, ఈపీఎస్‌ రూ.12.8 ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 3 శాతం పెరిగింది కానీ నికరలాభం 13 శాతం తగ్గింది.  

ప్రస్తుత త్రైమాసికం నుంచి మెరుగు: ‘ఏఆర్వీ ఏపీఐ, ఫార్ములేషన్ల విభాగానికి కష్టకాలం ముగిసినట్లే.. నాలుగో (జనవరి-మార్చి) త్రైమాసికం నుంచి ఈ విభాగంలో మెరుగైన అమ్మకాలు ఉంటాయ’ని లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. బయోటెక్నాలజీ విభాగమైన లారస్‌ బయో ఆదాయం స్థిరంగా ఉందని, మున్ముందు పెరిగేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. లారస్‌ బయో ఉత్పత్తి సామర్థ్యం 180 కిలోలీటర్లకు పెరిగినట్లు చెప్పారు. సీడీఎంఓ (కాంట్రాక్టు అభివృద్ధి, ఉత్పత్తి) కార్యకలాపాలు ఎంతో బాగున్నాయని ఆయన వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తమ ఫార్ములేషన్ల సామర్థ్యం రెట్టింపు అవుతుందని వెల్లడించారు.


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభంలో 17% క్షీణత

దిల్లీ: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం 17.20 శాతం తగ్గి రూ.121.61 కోట్లకు పరిమితమైంది. రుణాల వృద్ధి తగ్గడం, నిర్వహణ వ్యయాలు పెరగడం ఇందుకు కారణం. అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని, మార్చి త్రైమాసికంతో పాటు మున్ముందు మరింత మెరుగ్గా రాణిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి, మేనేజింగ్‌ డైరెక్టరు రాజీవ్‌ అహుజా అన్నారు. కొవిడ్‌-19 రెండో దశతో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు. జులై- సెప్టెంబరులో నమోదైన రూ.97.20 కోట్ల లాభాన్ని పరిగణనలోకి తీసుకుంటే అక్టోబరు- డిసెంబరులో బ్యాంకు పుంజుకుందని చెప్పొచ్చని, మున్ముందు మరింతగా మెరుగవుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం పెరిగి రూ.1,010 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 4.34 శాతానికి పెరిగింది. ఇతర ఆదాయం రూ.570 కోట్ల నుంచి రూ.620 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయాలు 44 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లకు చేరాయి. కొత్త సీఈఓ, ఎండీ అన్వేషణపై అహుజా స్పందిస్తూ.. బోర్డు సభ్యులు, నిపుణులతో ఏర్పాటైన ఆ కమిటీ ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసే పనిలో ఉందని అన్నారు.    


పీఎన్‌బీ లాభం రూ.1127 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) స్టాండలోన్‌ నికరలాభం రెట్టింపుకంటే అధికంగా రూ.1126.78 కోట్లకు చేరింది. 2020-21 ఇదేకాల లాభం రూ.506.03 కోట్లే కావడం గమనార్హం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,298.53 కోట్ల నుంచి రూ.22,026.02 కోట్లకు తగ్గింది. స్థూల నిరర్థక ఆస్తులు 12.99 శాతం నుంచి 12.88 శాతానికి తగ్గితే, నికర ఎన్‌పీఏలు 4.03శాతం నుంచి 4.90 శాతానికి పెరిగాయి. అయితే విలువ పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ.94,479.33 కోట్ల నుంచి రూ.97,258.67 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.26,598.13 కోట్ల నుంచి రూ.33,878.56 కోట్లకు చేరాయి. కేటాయింపులు రూ.5175.99 కోట్ల నుంచి రూ.3353.55 కోట్లకు తగ్గాయి. ఏకీకృత ప్రాతికపదికన బ్యాంక్‌ లాభం రూ.585.77 కోట్ల నుంచి రూ.1150.49 కోట్లకు పెరిగితే, ఆదాయం రూ.23,639.41 కోట్ల నుంచి రూ.22,275.40 కోట్లకు తగ్గింది.


కెనరా బ్యాంక్‌ లాభంలో 116% వృద్ధి

ముంబయి: డిసెంబరు త్రైమాసికంలో కెనరా బ్యాంక్‌ నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,502 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, కేటాయింపులు తగ్గడం ఇందుకు తోడ్పడింది. 2020-21 ఇదేకాల లాభం రూ.696 కోట్లు మాత్రమే. నికర వడ్డీ ఆదాయం రూ.6,087 కోట్ల నుంచి పెరిగి రూ.6,946 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం రూ.21,365 కోట్ల నుంచి రూ.21,312 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.79 శాతం నుంచి 2.83 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 7.46 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 2.64 శాతం నుంచి పెరిగి 2.86 శాతానికి చేరాయి. సమీక్షా త్రైమాసికంలో కొత్తగా రూ.2,699 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. అలాగే రూ.2,784 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. కేటాయింపులు రూ.4,572 కోట్ల నుంచి 35.56 శాతం తగ్గి రూ.2946 కోట్లకు పరిమితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని