సూచీలకు ఫెడ్‌ హడల్‌

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మార్చి నుంచి వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు హడలెత్తాయి. 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బాండ్ల కొనుగోలును నిలిపేస్తామని, ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌

Published : 28 Jan 2022 03:28 IST

రేట్ల పెంపు సంకేతాలతో అమ్మకాలు
ఐటీ, ఔషధ షేర్లు డీలా
సమీక్ష

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మార్చి నుంచి వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు హడలెత్తాయి. 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బాండ్ల కొనుగోలును నిలిపేస్తామని, ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రకటించినందున, నిధుల లభ్యతా తగ్గనుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచితే భారత్‌ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్న భయాలతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. గతేడాది అక్టోబరు  నుంచి ఇప్పటికే దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను విదేశీ మదుపర్లు ఉపసంహరించుకున్నారని అంచనా. విదేశీ సంస్థాగత మదుపుదార్లు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణను కొనసాగించడం, రూపాయి క్షీణతా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బడ్జెట్‌ ముందు మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించారు. ఐటీ, ఔషధ షేర్లు డీలాపడ్డాయి. బ్యాంకింగ్‌ షేర్లు రాణించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు తగ్గి నాలుగు వారాల కనిష్ఠమైన 75.09 వద్ద ముగిసింది. నీ మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.2.81 లక్షల కోట్లు తగ్గి రూ.259.97 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 57,317.38 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 56,439.36 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతుతో నష్టాలు తగ్గించుకున్న సెన్సెక్స్‌.. 57,508.61 వద్ద గరిష్ఠాన్ని చేరింది. చివరకు 581.21 పాయింట్ల నష్టంతో 57,276.94 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 167.80 పాయింట్లు కోల్పోయి 17,110.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,866.75- 17,182.50 పాయింట్ల మధ్య కదలాడింది.

ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో రేమండ్‌ షేరు ఇంట్రాడేలో 4.37 శాతం పెరిగి, రూ.818.25 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. తదుపరి లాభాల స్వీకరణ ఎదురుకావడంతో 0.62 శాతం నష్టంతో రూ.779.10 వద్ద ముగిసింది.

బలహీన ఫలితాలతో టొరెంట్‌ ఫార్మా షేరు ఇంట్రాడేలో 17.69 శాతం క్షీణించి రూ.2601.30 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 14.92% నష్టంతో రూ.2689.10 వద్ద ముగిసింది.

ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్‌ షేరు 8.77 శాతం లాభంతో రూ.240.70 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.17%, టెక్‌ మహీంద్రా 3.66%, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.42%, విప్రో 3.22%, టీసీఎస్‌ 3.18%, టైటన్‌ 2.90%, ఇన్ఫోసిస్‌ 2.53%, నెస్లే 2.15%, పవర్‌గ్రిడ్‌ 1.83%, టాటా స్టీల్‌ 1.80% మేర డీలాపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.81%, ఎస్‌బీఐ 2.75%, మారుతీ 2.52%, కోటక్‌ బ్యాంక్‌ 2.02%, సన్‌ఫార్మా 0.64% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ, టెక్‌, మన్నికైన వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి 3.10 శాతం వరకు తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని