టర్మ్‌ పాలసీ.. జాగ్రత్తలు తప్పనిసరి

ఒక వ్యక్తి అనుకోకుండా దూరమైనప్పుడు తనపై ఆధారపడిన కుటుంబానికి ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక సంఘర్షణకు తోడు.. కొన్నిసార్లు ఆర్థికంగానూ చిక్కులు

Updated : 05 Dec 2021 16:00 IST

ఒక వ్యక్తి అనుకోకుండా దూరమైనప్పుడు తనపై ఆధారపడిన కుటుంబానికి ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక సంఘర్షణకు తోడు.. కొన్నిసార్లు ఆర్థికంగానూ చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఇలాంటి సంఘటనలు గత రెండేళ్ల కాలంలో ఎన్నో చూశాం. కొవిడ్‌-19 ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చాలామందికి తమ పేరుమీద బీమా ఉండాలనే ఆలోచన వచ్చింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలకు గత కొంతకాలంగా గిరాకీ బాగా పెరిగింది. ఈ పాలసీలను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే.. అది మనకు కావాల్సిన రక్షణనిస్తుంది. అవేమిటో చూద్దాం.

అవసరం ఏమిటి?

టర్మ్‌ పాలసీ పూర్తిగా రక్షణకే పరిమితం అవుతుంది. అంటే.. పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. అప్పుడు మాత్రమే పరిహారం లభిస్తుంది. కాబట్టి, ఈ పాలసీని తీసుకునేటప్పుడు.. ముందుగా చూడాల్సింది.. ‘నాపై ఆధారపడిన వారు ఎవరైనా ఉన్నారా? అనుకోనిది జరిగినప్పుడు వారిపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది?’ అనేది చూసుకోవాలి. ఆధారపడిన వారు ఉండి, వారికి పాలసీదారుడే అన్నీ అయినప్పుడు తప్పనిసరిగా టర్మ్‌ పాలసీ తీసుకోవాల్సిందే.

ఎంత మొత్తానికి?

పాలసీ విలువ ఎంత ఉంటే సరిపోతుంది? దీనికి సమాధానం మీ ప్రస్తుత ఆదాయమే నిర్ణయిస్తుంది. చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పే సూత్రం.. వార్షికాదాయానికి కనీసం 10 నుంచి 20 రెట్ల వరకూ బీమా పాలసీ ఉంటే సరిపోతుందని. దీంతోపాటు.. పిల్లల చదువులు, వారి వివాహం, ఇతర ఆర్థిక బాధ్యతలనూ లెక్క చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో ముఖ్య విషయం.. అప్పులు. కేవలం వార్షికాదాయం లెక్కతోనే పాలసీ తీసుకుంటే.. అది కొన్నిసార్లు అప్పులకే సరిపోకపోవచ్చు. కాబట్టి, వార్షికాదాయం, బాధ్యతలు, అప్పులు ఈ మూడింటినీ పరిగణనలోనికి తీసుకొని, బీమా మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. పాలసీ ఎంత మొత్తం ఉండాలి అనేది తెలుసుకునేందుకు ఇప్పుడు చాలా ఆన్‌లైన్‌ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించుకోవవచ్చు. ఎంత వ్యవధికి తీసుకోవాలన్నదీ ఇక్కడ చూసుకోవచ్చు.

చరిత్ర చూడాలి..

పాలసీ ఎంత తీసుకోవాలి, ఎంత వ్యవధికి తీసుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత బీమా సంస్థ గురించి ఆరా తీయాలి. నమ్మకమైన బీమా సంస్థ ఎంపిక ఇక్కడ ఎంతో ప్రధానం. ఒక ఏడాదిలో ఎన్ని బీమా క్లెయింలు వచ్చాయి? వాటిని ఎంత మేరకు పరిష్కరించారు అనేది సంస్థ ఎంపికలో కీలకం. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థనే బీమా పాలసీ కోసం ఎంపిక చేసుకోండి.

అనుబంధ పాలసీలు..

జీవితంలోని దశలను బట్టి, టర్మ్‌ పాలసీకి కొన్ని అనుబంధ పాలసీలను జోడించుకునే ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌లాంటివి ఇందుకోసం ప్రయత్నించవచ్చు. వ్యక్తిగత ఆర్థిక సలహాదారు, లేదా అధీకృత బీమా సలహాదారు సూచనలను తీసుకోండి. పూర్తిస్థాయి బీమాతోపాటు.. అనుబంధ పాలసీలను జోడించుకోవడం ద్వారా అదనపు రక్షణ లభిస్తుంది.

పూర్తి వివరాలు చెప్పండి

బీమా సంస్థ.. పాలసీదారుడికి మధ్య కుదిరే ఒక నమ్మకమైన ఒప్పందమే బీమా పాలసీ. దీన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి దాపరికాలూ ఉండకూడదు. పాలసీదారుడికీ.. బీమా సంస్థకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అలవాట్లు.. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం లాంటివి ఉంటే వాటిని కచ్చితంగా తెలియజేయాలి. కుటుంబ ఆరోగ్య చరిత్రనూ బీమా సంస్థ తెలుసుకుంటుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు, ఆరోగ్య పరిస్థితి తదితరాల గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. కొన్నిసార్లు పాలసీరాదనే కారణంతో నిజాలు దాచిపెట్టడం చూస్తుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పాలసీ ఇచ్చినా.. క్లెయిం వేళలో చిక్కులు రావచ్చు. దీనివల్ల బీమా తీసుకున్న లక్ష్యం నెరవేరదు. అన్ని వివరాలూ తెలియజేస్తే.. బీమా సంస్థ కాస్త అధిక ప్రీమియాన్ని వసూలు చేయొచ్చు.

చికిత్స కన్నా నివారణే ముఖ్యం అనేది మనకు తెలిసిందే. కష్ట కాలంలో కుటుంబం ఆర్థిక చిక్కులను ఎదుర్కోకుండా.. ముందు నుంచే జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం.

- భరత్‌ కల్సీ, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని