రిలయన్స్ జియో‌ పిటిషన్‌: కేంద్రానికి నోటీసులు

తమ కంపెనీ సెల్‌ టవర్లను ధ్వంసం చేసిన ‘స్వార్థ ప్రయోజన శక్తుల’పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌ను

Published : 05 Jan 2021 17:22 IST

చండీగఢ్‌: తమ కంపెనీ సెల్‌ టవర్లను ధ్వంసం చేసిన ‘స్వార్థ ప్రయోజన శక్తుల’పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌ను పంజాబ్‌, హరియాణా హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. 

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు ఉద్యమం సాగిస్తున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా జియో టవర్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీనిపై రిలయన్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. తమ టవర్ల ధ్వంసం వెనుక ‘స్వార్థ ప్రయోజన శక్తులు, వ్యాపార ప్రత్యర్థి సంస్థల’ కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. 

‘‘వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు లాభం చేకూరుతుందనే దుష్ప్రచారం వల్ల మా వ్యాపారాలు, ఆస్తులు నిరసనకారులకు లక్ష్యంగా మారాయి. రైతులకు మద్దతు పేరుతో మా టెలికాం టవర్ల ధ్వంసం, సేవల అంతరాయమే లక్ష్యంగా ఆందోళనకారులను కొన్ని స్వార్థ ప్రయోజన శక్తులు ప్రేరేపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, తీగలు కత్తిరించడం చేస్తున్నారు. కొన్ని సేవా కేంద్రాలు, రిటైల్‌ స్టోర్లను బలవంతంగా మూయించారు. అంతేగాక, మా సిబ్బందిని భయపెట్టి విధుల్లోకి రాకుండా చేస్తున్నారు’ అని కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, టవర్లపై దాడులు ఆగేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరింది. 

కొత్త సాగు చట్టాలపై సోమవారం స్పందించిన రిలయన్స్.. వాటి వల్ల తమకు ప్రయోజనమేమీ లేదని తెలిపింది. కార్పొరేట్‌ లేదా కాంట్రాక్ట్‌ వ్యవసాయం నిమిత్తం పంజాబ్‌, హరియాణాలోనే కాదు భారత్‌ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేయలేదని ప్రకటించిన విషయం విదితమే. 

ఇదీ చదవండి..

ఒప్పంద వ్యవసాయం చేయట్లేదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని