Car Loan: కారు లోన్ తీసుకుంటున్నారా.. కాల‌ప‌రిమితి ఎంతుండాలి?

కారు త‌రుగుద‌ల ఉన్న‌ ఆస్తి. కాబ‌ట్టి రుణం తీసుకుని కారు కొనే వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. వీలైనంత త‌క్కువ స‌మ‌యంలో రుణం చెల్లించేందుకు ప్ర‌య‌త్నించాలి. 

Updated : 18 Nov 2021 15:45 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత ఇల్లు ఉండాల‌ని ఎలా క‌ల‌లు కంటారో అలాగే సొంత కారు ఉండాల‌నేది కూడా చాలామంది కోరిక‌. అయితే ప్ర‌స్తుతం కారు అవ‌స‌రం కూడా పెరిగింది. కొవిడ్ త‌ర్వాత ప్రజ‌లు ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల‌లో ప్ర‌యాణించ‌డం కంటే సొంత వాహ‌నం లేదా ప్ర‌త్యేక వాహ‌నంలో ప్ర‌యాణించ‌డం అన్ని విధాల మంచిద‌ని భావిస్తున్నారు. కుటుంబంలో న‌లుగురైదుగురు ఉంటారు కాబ‌ట్టి కచ్చితంగా కారు అవ‌స‌ర‌మే. బ‌య‌ట‌కు వెళ్లిన ప్ర‌తిసారీ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే బిల్లు చాలానే అవుతుంది. అదీగాక మెట్రో న‌గ‌రాల్లో అయితే క్యాబ్‌లు సుల‌భంగానే దొరుకుతాయి గానీ, చిన్న చిన్న ప‌ట్ట‌ణాలు, మారుమూల ప్రాంతాల్లో ఈ స‌దుపాయం అరుద‌నే చెప్పాలి. 

కారు కొనుగోలు కోసం కొంత మొత్తం పొదుపు చేసినా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుంచి రుణం పొందొచ్చు. అయితే ఈ రుణాల‌ను స‌కాలంలో తిరిగి చెల్లించ‌డం చాలా ముఖ్యం. రుణం తీసుకున్న‌ప్పుడు ప్ర‌తి నెలా ఈఎంఐ రూపంలో చెల్లింపులు చేస్తారు. అయితే సుల‌భంగా రుణం చెల్లించాలంటే ఎంత కాల‌ప‌రిమితి ఎంచుకోవాలి? ఎంత ఈఎంఐ ఉండాలి? అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం..

కాల‌ప‌రిమితి ఎంతుండాలి?: సాధారణంగా 7 నుంచి 8 సంవత్సరాల గ‌రిష్ఠ కాల‌ప‌రిమితితో కారు రుణాలు ఇస్తుంటాయి బ్యాంకులు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 7 సంవత్సరాల కాలవ్యవధితో కారు రుణాలను ఆఫ‌ర్ చేస్తోంది. అయితే రుణ‌దాత‌లు ఎక్కువ కాల‌ప‌రిమితో రుణాలు అందిస్తున్న‌ప్ప‌టికీ.. త‌క్కువ (3 నుంచి 4 సంవ‌త్స‌రాలు) కాల‌పరిమితిని ఎంచుకోవడం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు ఈఎంఐను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. కాల‌పరిమితి త‌క్కువ ఉంటే ఈఎంఐ పెరుగుతుంది. త‌క్కువ ఈఎంఐను ఎంచుకుంటే కాల‌ప‌రిమితి పెరుగుంది.

ఎక్కువ కాల‌ప‌రిమితి ఈఎంఐను ఎలా ప్ర‌భావితం చేస్తుంది?: ఎక్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌డం వ‌ల్ల ఈఎంఐ త‌గ్గుతుంది కాబ‌ట్టి ప్ర‌తినెలా కొద్ది మొత్తంలో డ‌బ్బు చెల్లిస్తే స‌రిపోతుంద‌ని చాలా మంది ఎక్కువ కాల‌ప‌రిమితి ఎంచుకుంటారు. అందుకే కాల‌పరిమితి ఎక్కువ ఆఫ‌ర్ చేస్తున్న బ్యాంకుల కోసం అన్వేషిస్తుంటారు. అయితే, ఇక్క‌డ ఒక ముఖ్య‌మైన విషయం తెలుసుకోవాలి. రుణం ప్రారంభ సంవ‌త్స‌రాల్లో ఈఎంఐలో అధిక భాగం వ‌డ్డీ ఉంటుంది. త‌క్కువ ఈఎంఐను ఎంచుకోవ‌డం వ‌ల్ల అందులో ఎక్కువ భాగం వ‌డ్డీనే ఉంటుంది కాబ‌ట్టి అస‌లు మొత్తం దాదాపు అలాగే ఉండిపోతుంది. అంటే మొత్తంగా చూసుకుంటే వ‌డ్డీ ఎక్కువ చెల్లిస్తున్నారన్న‌మాట‌. మ‌రోవైపు అధిక ఈఎంఐ అంటే వ‌డ్డీని త‌గ్గించుకోవ‌డం అని అర్థం. వ‌డ్డీతో పాటు అస‌లు మొత్తం కూడా చాలా వ‌ర‌కు చెల్లిస్తున్నారు కాబ‌ట్టి వేగంగా రుణం తీర్చ‌గ‌ల‌రు. 

ఉదాహ‌ర‌ణ‌కు, మీరు 8.5 శాతం వ‌డ్డీతో రూ.10 ల‌క్ష‌ల‌ కార్‌లోన్ తీసుకున్నార‌నుకుందాం. తిరిగి చెల్లించేందుకు నాలుగు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితిని ఎంచుకుంటే  ప్ర‌తి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం రూ.24,000. అదే మొత్తాన్ని అదే వ‌డ్డీతో 8 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధితో తీసుకుంటే ప్ర‌తి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం రూ. 14,000. అంటే చెల్లింపులకు ఎంచుకున్న 8 సంవ‌త్స‌రాల స‌మయం ప్ర‌తి నెలా ఈఎంఐని రూ.10 వేల వ‌ర‌కు తగ్గిస్తుంది. కానీ 8 ఏళ్ల కాల‌ప‌రిమితిలో మీరు చెల్లించే వ‌డ్డీ దాదాపు రూ.3.81 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. అదే 4 ఏళ్ల కాలాన్ని ఎంచుకుంటే చెల్లించే వ‌డ్డీ దాదాపు రూ. 1.83 ల‌క్ష‌లు ఉంటుంది. అంటే 8ఏళ్లు ఎంచుకుంటే.. దాదాపు రెట్టింపు వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది. 

ఈఎంఐకి తోడు.. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల భారం: ఇక్క‌డ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోద‌గ్గ మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. కారు స‌గ‌టు వినియోగ వ్య‌వ‌ధి సాధార‌ణంగా 5 నుంచి 6 సంవ‌త్స‌రాలు ఉంటుంది. అదీగాక కారు త‌యారీదారులు 8 సంవ‌త్సరాల వారెంటీ ఇవ్వ‌రు కాబ‌ట్టి.. ఆ త‌ర్వాత నిర్వ‌హ‌ణ పెరిగే అవ‌కాశం ఉన్నందున.. ఈఎంఐలకు ఈ ఖ‌ర్చులు తోడై భారం పెరిగే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల కారు ఇత‌రుల‌కు లేదా సెకెండ్ హ్యాండ్ డీల‌ర్ల‌ల‌కు విక్ర‌యించే అవ‌కాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక‌వేళ విక్ర‌యించినప్ప‌టికీ.. కొనుగోలు చేసిన వారు బ్యాంకు బ‌కాయిలను ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే కారు యాజ‌మాన్యం హ‌క్కులు కొనుగోలు చేసిన వ్య‌క్తి పేరుపైకి మార‌తాయి. 

కాల‌ప‌రిమితితో పాటు వ‌డ్డీ రేటు పెరగొచ్చు: తక్కువ రుణ కాల వ్యవధితో పోలిస్తే, ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకున్న వారి నుంచి బ్యాంకులు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను వసూలు చేస్తాయి.  బ్యాంకులు ఎక్కువ కాల‌వ్య‌వ‌ధితో రుణం తీసుకున్న‌వారికి సాధారణ కారు లోన్ కంటే దాదాపు 50 బేసిస్ పాయింట్ల (0.5 శాతం) అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. రుణగ్రహీతపై తీసుకుంటున్న అదనపు క్రెడిట్ రిస్క్‌ను భర్తీ చేసేందుకు బ్యాంకులు/రుణదాతలు ఈ మార్గం అనుస‌రిస్తాయ‌ని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

గుర్తుంచుకోండి..: కారుకు త‌రుగుదల (డిప్రిసియేషన్) ఉంటుంది. కాబ‌ట్టి కాలం గ‌డిచే కొద్ది విలువ త‌గ్గిపోతుంది. అందువ‌ల్ల రుణం తీసుకుని కారు కొనే వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. వ‌డ్డీ రేట్ల‌తో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-పెమెంటు (ముంద‌స్తు చెల్లింపుల‌కు విధించే) ఛార్జీలు, ఇత‌ర అనుబంధ ఖ‌ర్చులు ఉంటాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు మెరుగైన వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మాఫీ కోసం రుణ‌దాత‌తో చ‌ర్చించొచ్చు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని