బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా క‌వ‌రేజీ పెరిగే అవ‌కాశం

ప్ర‌స్తుతం 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్' బ్యాంక్ డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల బీమా క‌వరేజీ అందిస్తోంది

Published : 26 Dec 2020 14:01 IST

డిపాజిట్ గ్యారెంటీ ప‌థ‌కం ప‌రిమితిని ప్ర‌స్తుతం ఉన్న రూ. 1 ల‌క్ష నుంచి పెంచ‌డానికి ప్ర‌భుత్వం చ‌ట్టాల‌ను తీసుకురానుంద‌ని ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాలం పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో ఈ చ‌ట్టాలు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఇటీవ‌ల ముంబైకి చెందిన ప‌ట్ట‌ణ స‌హ‌కార బ్యాంక్ పీఎమ్‌సీ సంక్షోభానికి గురైన నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. పీఎమ్‌సీ బ్యాంక్ సంక్షోభానికి గురి కావ‌డంతో ఈ బ్యాంకుపై రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్ష‌లు విధించ‌డంతో ఖాతాలో డ‌బ్బులు ఉన్న విత్‌డ్రా చేసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజ‌గా స‌ర‌ళించిన నిబంధ‌న‌ల ప్ర‌కారం ఖాతాదారులు విత్‌డ్రా ప‌రిమితిని రూ.50 వేల‌కు పెంచిన‌ట్లు తెలుస్తుంది.

బ్యాంకులు, ఖాతాదారులకు సొమ్ము చెల్లించ‌డంలో విఫ‌లం అయితే ప్ర‌స్తుతం ఉన్న బ్యాంక్‌ డిపాజిట్ బీమా ప‌థకం కింద రూ.1 ల‌క్ష వ‌ర‌కు బీమా స‌దుపాయం అందుబాటులో ఉంది. ఈప‌థ‌కం బీమా క‌లిగిన బ్యాంకు పొదుపు, ఫిక్స్‌డ్‌, రిక‌రింగ్ డిపాజిట్ల‌తో పాటు అన్ని ర‌కాల బ్యాంకు డిపాజిట్ల‌కు వ‌ర్తిస్తుంది. ఇందుకు గానూ బ్యాంకులు త‌మ‌ డిపాజిట్లను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్‌(డీఐసీజీసీ)లో బీమా చేయించి ఉండాలి. ఇది బ్యాంకు డిపాట‌ర్ల నుంచి నేరుగా ప్రీమియం వ‌సూలు చేయ‌దు. ఈ ప‌థ‌కం కింద క‌వ‌రేజ్ కోసం బ్యాంకులు నామ‌మాత్ర‌పు ప్రీమియంను డీఐసీజీసీకి చెల్లిస్తాయి.

ఏ కార‌ణం చేత‌నైనా బ్యాంకులు మూత‌ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే డిపాజిట్ గ్యారెంటీ సంస్థ నిధుల‌ను విడుద‌ల చేస్తుంది. బ్యాంకు కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నంత వ‌ర‌కు ఇది వ‌ర్తించ‌దు. ప్ర‌స్తుతం డిపాజిట్ గ్యారెంటీ ప‌థ‌కం కింద ఉన్న రూ. 1ల‌క్ష ప‌రిమితిని పార్ల‌మెంట్ ఆమోదం ద్వారా పెంచుతామ‌ని తెలిపింది. ఈ ప‌థ‌కం ప‌రిమితిని పెంచాల్సి అవ‌స‌రం ఉంద‌ని ఎస్‌బీఐ సైతం త‌న నివేదిక‌లో పేర్కొంది.

డిపాజిట్ ఇన్సురెన్స్ ప‌థ‌కం గురించిన ముఖ్య విష‌యాలు:

  • బ్యాంకు డిపాజిట్ల‌కు అస‌లు, వ‌డ్డీతో క‌లిపి రూ. 1ల‌క్ష వ‌ర‌కు హామీ ఉంటుంది.

  • ఒక వ్య‌క్తికి సంబంధించి ఒకే విఫ‌ల‌మైన‌ బ్యాంకు, వేరు వేరు బ్రాంచ్‌ల‌లో ఒక‌టి కంటే ఎక్కువ‌ డిపాజిట్లు ఉన్న‌ప్ప‌టికీ, వాట‌న్నింటిని క‌లిపి ఒకే ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది. అంటే ఒక వ్య‌క్తి ఎన్ని బ్రాంచిల‌లో డిపాజిట్లు ఉన్న‌ప్ప‌టికీ, వాట‌న్నింటిపై గ‌రిష్టంగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు మాత్ర‌మే హామీ మొత్తం ల‌భిస్తుంది.

  • అయితే వేరు వేరు బ్యాంకుల‌లో ఉన్న డిపాజిట్ల‌ను మాత్రం క‌ల‌ప‌రు.

  • ప్రైవేట్ రంగ బ్యాంకులు, కో-ఆప‌రేటీవ్ బ్యాంకులు, భార‌త్‌లో బ్రాంచ్‌లు నిర్వ‌హిస్తున్న విదేశీ బ్యాంకుల‌తో స‌హా ప్ర‌స్తుతం భార‌త్‌లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న అన్ని బ్యాంకుల‌ను డిపాజిట్ ఇన్సురెన్స్ ప‌థ‌కం క‌వ‌ర్ చేస్తుంది. అయితే విదేశీ ప్ర‌భుత్వ డిపాజిట్లు, కేంద్ర‌/రాష్ట్ర ప్ర‌భుత్వాల డిపాజిట్లు, ఇంట‌ర్‌-బ్యాంక్ డిపాజిట్ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని