Relaince IPO: భారత్‌లో భారీ ఐపీఓలకు సిద్ధమవుతున్న ముకేశ్‌ అంబానీ?

ఎల్ఐసీ పబ్లిక్‌ ఇష్యూ భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) గా ఖ్యాతికెక్కనుంది.......

Published : 29 Apr 2022 14:40 IST

ముంబయి: ఎల్ఐసీ పబ్లిక్‌ ఇష్యూ భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO)గా ఖ్యాతికెక్కనుంది. అయితే, దీనికంటే పెద్ద పబ్లిక్‌ ఇష్యూలను తీసుకొచ్చేందుకు భారత వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

రిలయన్స్ రిటైల్‌ వెంచర్స్ (Reliance Retail Ventures-RRVL)‌, రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫారం (Reliance Jio Platform-RJPL)లను ఐపీఓకి తీసుకొచ్చే యోచనలో అంబానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో కంపెనీ దాదాపు రూ.50,000-70,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రమోటర్లు దాదాపు 10 శాతం వాటాలను వదులుకునే అవకాశం ఉంది. ఈ రెండు ఐపీఓలకు సంబంధించి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) రాబోయే వార్షిక సమావేశంలో అధికారికంగా ప్రకటించవచ్చని అంచనా.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ...

భారత మార్కెట్లతో పాటు రిలయన్స్ రిటైల్ (RRVL), జియో (RJPL) కంపెనీలను అంతర్జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలోనూ నమోదు చేసేందుకు రిలయన్స్ వర్గాలు యోచిస్తున్నట్లు సమాచారం. టెక్‌ కంపెనీలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ అయిన అమెరికాలోని నాస్డాక్‌లో జియోను లిస్ట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాత మార్కెట్‌ నియంత్రణా సంస్థలకు ఐపీకి సంబంధించిన ముసాయిదా పత్రాలను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత డిసెంబరు 2022లో రిలయన్స్‌ రిటైల్‌.. తర్వాత కొంతకాలానికి జియో ఐపీఓను ప్రారంభించొచ్చని అంచనా. 2020లో జియోలో 33 శాతం వాటాను ఫేస్‌బుక్‌, గూగుల్‌ సహా పలు కంపెనీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నీ తమ వాటాలను ఐపీఓల్లో విక్రయించే అవకాశం ఉందని సమాచారం. రిటైల్‌ విలువను రూ.8లక్షల కోట్లుగా.. జియోను రూ.7.5 లక్షల కోట్లుగా అంచనా వేయొచ్చని తెలుస్తోంది. 

నిత్యావసరాలు, దుస్తులు, పాదరక్షలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌ (RRVL) నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 14,500 స్టోర్లు ఉన్నాయి. జియోమార్ట్‌ పేరిట భారత్‌లో అతిపెద్ద ఈ-కామర్స్ వేదికను కూడా నడుపుతోంది. డిసెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.50,654 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రిటైల్‌లో 2020 సెప్టెంబరులో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ 1.75 శాతం వాటాను సొంతం చేసుకుంది. 420 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో రిలయన్స్‌ జియో (RJPL) భారత్‌లో అతిపెద్ద టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌గా కొనసాగుతోంది. ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ.. జియో విలువను రూ.7.56 లక్షల కోట్లుగా అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని