మహిళా వ్యాపారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ కార్డు...

మహిళా వ్యాపారాలు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను పెంచుకోవడంలో ప్రీపెయిడ్ కార్డు సహాయపడుతుంది

Published : 17 Mar 2022 15:12 IST

దేశంలోని మహిళా వ్యాపారులు సులభంగా చెల్లింపులను స్వీకరించడానికి, రుణాలను పొందడానికి, అలాగే ప్రతి లావాదేవీపై రివార్డ్ లను అందించాలనే ఉద్దేశ్యంతో మహిళా మనీ, వీసా, ట్రాన్స్‌కార్ప్ సంయుక్తంగా "మహిళా మనీ ప్రీపెయిడ్ కార్డ్‌" పేరుతో ఒక కార్డును ప్రారంభించాయి. మహిళా వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఈ ప్రీపెయిడ్ కార్డ్ సహాయపడుతుందని "మహిళా మనీ" ఒక ప్రకటనలో తెలిపింది.

ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో 81 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 80.7 శాతం మంది మహిళలు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారని, అయితే అందులో 55 శాతం మంది మహిళలు ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాలను పెద్దగా ఉపయోగించడం లేదని తాజా సర్వే తెలిపింది. అదే విధంగా మరో ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో, దాదాపు మూడింట రెండు వంతుల మంది పట్టణ మహిళలు డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారని, అయితే వారిలో మూడవ వంతు కంటే తక్కువ మంది మాత్రమే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను కూడా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది.
 
డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించడాన్ని సులభతరం చేయడం ద్వారా మహిళా వ్యాపారాలు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను పెంచుకోవడంలో ప్రీపెయిడ్ కార్డు సహాయపడుతుంది. అలాగే వ్యాపార విస్తరణ కోసం తీసుకునే రుణాలను కూడా నేరుగా కార్డులోకి బదిలీ చేసుకోవచ్చు. దీనికి అదనంగా ప్రోత్సాహకాలు, రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్ లను కూడా మహిళా వ్యాపారులకు ప్రీపెయిడ్ కార్డు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ కార్డు డిజిటల్ గా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు భౌతిక కార్డు కావాలనుకుంటే, అభ్యర్థనపై కార్డును మీ చిరునామాకు పంపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని