Bharat NCAP: ‘భారత్‌ ఎన్‌క్యాప్‌’ వచ్చేసింది.. కార్లకు స్టార్ రేటింగ్‌ ఎప్పటి నుంచంటే?

కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానం భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP)ను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ప్రకటించారు.

Published : 22 Aug 2023 13:54 IST

దిల్లీ: ప్రజలకు నాణ్యత, భద్రత, కాలుష్యంపై అవగాహన పెరిగిందని, వాటికి సంబంధించి ఏదైనా కొత్త విధివిధానాలు అమలు చేస్తే.. పాటించేందుకు వారు  సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానం భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP/BNCAP - Bharat New Car Assesment Programme)ను ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్‌ ఎన్‌క్యాప్‌ లోగో, స్టిక్కర్‌ విడుదల చేశారు.

‘‘గతంలో కార్ల సేఫ్టీ పరీక్షలకు అవసరమైన క్రాష్‌ టెస్ట్‌ (Crash Test) కోసం దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలు విదేశాల్లో రూ.2.50 కోట్లు ఖర్చు చేసేవి. ప్రస్తుతం దేశీయంగా ఈ విధానం రూ.60 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలకు క్రాష్‌ టెస్ట్‌కు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అక్టోబరు 1 నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందులో ఫ్రంట్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌ (కారు ముందు), సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌ (కారు కుడి లేదా ఎడమవైపు), పోల్‌ సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టులు ఉంటాయి. ఇప్పటికే భారత్‌ ఎన్‌క్యాప్‌ విధానం ద్వారా పరీక్షించేందుకు దేశీయ కార్ల తయారీ సంస్థలు 30కిపైగా కార్లను అందించాయి. ఇది పూర్థిస్థాయిలో పనిచేయడం ప్రారంభమైన తర్వాత పెట్రోల్‌, డీజీల్‌ వాహనాలతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు సైతం భద్రతా పరీక్షలు నిర్వహించి రేటింగ్‌ ఇస్తాం. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడంతోపాటు, వినియోగదారులకు సురక్షితమైన కార్లను అందించాలనే లక్ష్యంతో భారత్‌ ఎన్‌క్యాప్‌ను తీసుకొచ్చాం’’ అని గడ్కరీ తెలిపారు.

జీఎస్‌టీ రివార్డ్‌ స్కీమ్‌.. రూ.కోటి వరకు ప్రైజ్‌ మనీ

  • భారత్‌ ఎన్‌క్యాప్‌లో కార్లను ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌ (AIS) 197 ప్రకారం పరీక్షిస్తారు. అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (AOP - పెద్దల భద్రత), ఛైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (COP - పిల్లల భద్రత)కు ఎలాంటి ప్రమాణాలు పాటించారనేది ఈ క్రాష్‌ టెస్ట్‌లో పరీక్షిస్తారు. 
  • ఈ క్రాష్‌ టెస్ట్‌లో ఐదు భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కారును డిజైన్‌ చేశారా? లేదా?, కారులో ప్రయాణించే పెద్దల భద్రతకు ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లల భద్రతకు ఇస్తున్న ఫీచర్లు ఏంటి? పాదచారులను కారు ఢీకొన్నప్పుడు వారిపై ఎంత మేర ప్రభావం ఉంటుంది? భద్రత కోసం కారులో ఎలాంటి సాంకేతికతను ఉపయోగించారు? వంటి అంశాలను పరీక్షిస్తారు.
  • భారత్‌ ఎన్‌క్యాప్‌ పరీక్షల కోసం ఆటోమొబైల్‌ సంస్థలు కారును స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లేదా, మార్కెట్లోకి విడుదలైన కొత్త కార్లను పరీక్షల కోసం షోరూమ్‌ల నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ తీసుకుంటుంది. క్రాష్‌ టెస్ట్‌ అనంతరం కార్ల స్టార్‌ రేటింగ్ వివరాలను భారత్‌ ఎన్‌క్యాప్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని