GST reward: జీఎస్‌టీ రివార్డ్‌ స్కీమ్‌.. రూ.కోటి వరకు ప్రైజ్‌ మనీ

GST reward scheme: మీరు కొంటున్న వస్తువులకు బిల్లులు అడుగుతున్నారా?ఇకపై మర్చిపోకుండా ఇన్‌వాయిస్‌లు తీసుకోండి. ఎందుకంటే వాటితో మీరు రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ గెల్చుకోవచ్చు. ఇందుకోసం కేంద్రం త్వరలోనే సరికొత్త పథకం తీసుకురాబోతోంది.

Published : 22 Aug 2023 13:07 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను (GST) ఎగవేతను నిరోధించేందుకు కేంద్రం వ్యాపారులకు పలు నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో ఇప్పుడు కస్టమర్లను కూడా భాగస్వాములను చేస్తోంది. త్వరలోనే ‘మేరా బిల్‌ మేరా అధికార్‌ (Mera Bill Mera Adhikar)’ పేరుతో సరికొత్త ఇన్‌వాయిస్‌ ప్రోత్సాహక పథకాన్ని (GST reward scheme) ప్రారంభించనుంది. ఈ రివార్డు స్కీమ్‌తో కస్టమర్లు రూ.10వేల నుంచి రూ.కోటి వరకు నగదు బహుమతి పొందొచ్చు. ఏంటీ కొత్త స్కీం..? ఎందుకోసం తీసుకొస్తున్నారు..?

కస్టమర్లు తాము కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు విక్రయదారుల నుంచి బిల్లు అడిగేలా వారిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. సెప్టెంబరు 1 నుంచి మూడు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (CBIC) మంగళవారం వెల్లడించింది. కస్టమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువుల జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌ (Invoice)లను చూపించి రివార్డులు గెలుచుకోవచ్చని తెలిపింది.

కొత్త అవకాశాలు.. ఖాళీ పోస్టుల భర్తీ: నియామకాలు బాగుంటాయ్‌

ఈ రివార్డు స్కీం ఎలా ఉంటుందంటే..

  • ఇందుకోసం ‘మేరా బిల్‌ మేరా అధికార్‌ (Mera Bill Mera Adhikar)’ పేరుతో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
  • కస్టమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను ఇందులో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఈ ఇన్‌వాయిస్‌ (Invoice)లపై విక్రేతల GSTIN నంబరు, ఇన్‌వాయిస్‌ నంబరు, చెల్లించిన మొత్తం, ట్యాక్స్ అమౌంట్‌ కచ్చితంగా ఉండాలి.
  • కేవలం జీఎస్‌టీ నమోదిత సప్లయర్లు విక్రయించిన వస్తువులు, సేవలకు సంబంధించిన బిల్లులకు మాత్రమే ఈ రివార్డు వర్తిస్తుంది.
  • ఈ స్కీమ్‌ కింద నెలా వారీ, లేదా మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారు. డ్రాలో గెలిచిన వారు రూ.10వేల నుంచి రూ.కోటి వరకు నగదు బహుమతి గెలుచుకునే అవకాశం ఉంటుందని CBIC ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించింది.
  • కనీసం రూ.200 అంతకంటే ఎక్కువ మొత్తం వెచ్చించిన ఇన్‌వాయిస్‌లను లక్కీ డ్రాకు పరిగణిస్తారు. ఒక కస్టమర్‌ నెలకు గరిష్ఠంగా 25 ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్‌ చేసుకునే వీలుంటుంది.
  • ఈ మొబైల్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వెర్షన్లలో అందుబాటులో ఉండనుంది.
  • సెప్టెంబరు 1న అస్సాం, గుజరాత్‌, హరియాణా, పుదుచ్చేరీ, దమన్‌ దయ్యూ, దాద్రా నగర్‌ హవేలీ ప్రాంతాల్లో ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

వినియోగదారులు తాము కొన్న వస్తువులకు విక్రేతల నుంచి వాస్తవమైన ఇన్‌వాయిస్‌లను అడిగే విధంగా వారిని ప్రోత్సహించేలా ఈ రివార్డు స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు ఆస్కారం ఉండదని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని