Postal schems: పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌ Vs మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్

పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్లు, నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు రెండింటికి ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది.

Updated : 08 Dec 2021 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొదుపు అల‌వాటుగా మారేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి పోస్టాఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు. ప్ర‌స్తుతం 9 ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను భార‌తీయ త‌పాలా శాఖ అందిస్తోంది. ఈ ప‌థ‌కాలు పెట్టుబ‌డిపై స్థిర‌మైన రాబ‌డి అందిస్తాయి. ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఉంటుంది కాబ‌ట్టి రాబ‌డికి హామీ ఉంటుంది. వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసికంగా ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంది. పోస్టాఫీస్ అందించే పొదుపు ప‌థ‌కాల్లో రికరింగ్ డిపాజిట్‌ (ఆర్‌డీ) ఖాతా ప్ర‌స్తుత త్రైమాసికానికి 5.8 శాతం వ‌డ్డీ రేటును, నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌) 6.6 శాతం రాబ‌డిని అందిస్తున్నాయి. ఈ రెండు మార్కెట్ లింక్డ్ స్కీమ్స్ కావు. అందువ‌ల్ల రెండు పథకాలు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. ఈ రెండు ప‌థ‌కాలు ఏవిధంగా ప‌నిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.

పెట్టుబడులు: పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌ ఖాతాలో ముందుగా నిర్ణ‌యించిన మొత్తాన్ని, నిర్ణ‌యించిన వ్య‌వ‌ధుల్లో జ‌మ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి నెల‌వారీ చెల్లించిన మొత్తం నిర్ణ‌యించిన త‌ర్వాత మార్చుకునే వీలులేదు. రికరింగ్ డిపాజిట్ల‌ పెట్టుబడుల‌పై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. కనీస డిపాజిట్ నెల‌కు రూ.100 డిపాజిట్‌దార్లు రూ.10 గుణిజాల్లో త‌మ‌కు అనుకూల‌మైన మొత్తాన్ని నెల నెల డిపాజిట్ చేయొచ్చు. ప్రతి నెలా డిపాజిట్ మొత్తాన్ని స‌మ‌యానికి చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయంలో నిర్ణీత‌ మొత్తాన్ని జమ చేయకపోతే, ఖాతాను డిఫాల్ట్‌గా పరిగణించి డీయాక్టివేట్ చేస్తారు. తిరిగి యాక్టివేట్ చేయ‌డానికి ప్రతి రూ.100కి రూ.1 చెల్లించాలి. దాంతో పాటు అప్ప‌టివ‌ర‌కు చెల్లించాల్సిన‌ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. నాలుగు సార్లు వ‌రుస‌గా స‌మ‌యానికి చెల్లించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, రెండు నెలల వ‌ర‌కు ఖాతాను తిరిగి యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఈ వ్యవధిలో ఖాతా పునరుద్ధరించ‌క‌పోతే, అది నిలిపివేస్తారు. తదుపరి డిపాజిట్ చేసేందుకు వీలుండ‌దు.

ఇక‌ నెలవారీ ఆదాయ పథకం విషయానికి వ‌స్తే.. ఈ ప‌థ‌కంలో డిపాజిట్లు రూ.1000 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌త ఖాతాదారులు గ‌రిష్ఠంగా రూ.4.50 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాదారులు గ‌రిష్ఠంగా రూ.9 ల‌క్ష‌ల వర‌కు ఇందులో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ముగ్గురు వ్య‌క్తులు జాయింట్‌గా ఖాతా తీసుకున్న‌ప్ప‌టికీ గ‌రిష్ఠంగా రూ.9 ల‌క్ష‌లే డిపాజిట్ చేయ‌గ‌ల‌రు. ఉమ్మ‌డి ఖాతాలో ఖాతాదారులంద‌రికీ స‌మానంగా వాటా ఉంటుంది.

కాల‌ప‌రిమితి: పోస్టాఫీస్ రిక‌రింగ్ రింగ్ డిపాజిట్లు 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో వ‌స్తాయి. మ‌రో ఐదేళ్లు ఖాతాను పొడిగించుకోవ‌చ్చు. కానీ నెల‌వారీ వాయిదాల‌ను స‌మ‌యానికి చెల్లించాలి లేదంటే పెనాల్టీ ప‌డుతుంది. ఎమ్ఐఎస్‌లో 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఒక‌వేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మ‌ర‌ణిస్తే ఖాతా మూసివేయ‌వ‌చ్చు. నామినీ/ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు ఖాతాలో ఉన్న‌ మొత్తాన్ని చెల్లిస్తారు. డ‌బ్బు వాప‌సు చేసే ముందు నెల వ‌ర‌కు వ‌డ్డీ చెల్లిస్తారు.

ముంద‌స్తు విత్‌డ్రాలు: నిర్దిష్ట ష‌ర‌తుల‌కు లోబ‌డి రెండు ప‌థ‌కాల్లోనూ ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. రిక‌రింగ్ డిపాజిట్ల విష‌యంలో ఒక సంవ‌త్స‌రం త‌రువాత ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. ఖాతాలో జ‌మ చేసిన మొత్తం నుంచి 50 శాతం వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ మొత్తాన్ని నెల‌వారీ వాయిదాల‌లో గానీ, ఏక మొత్తంగా గానీ మెచ్యూరిటి వ్య‌వ‌ధిలోపు తిరిగి చెల్లించ‌వ‌చ్చు. అయితే దీనిపై సాధార‌ణ వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ కాల‌ప‌రిమితి ముగిసేలోపు తిరిగి చెల్లించ‌లేక పోతే విత్‌డ్రా చేసుకున్న మొత్తం, వ‌ర్తించే వ‌డ్డీల‌ను.. మెచ్యూరిటీ మొత్తం నుంచి మిన‌హాయించి మిగిలిన మొత్తాన్ని డిపాజిట‌ర్ల‌కు చెల్లిస్తారు. ఎమ్ఐఎస్‌లో డిపాజిట్‌ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేయాలనుకుంటే డిపాజిట్‌ మొత్తం సొమ్ముపై 2 శాతం కోత విధిస్తారు. మూడేళ్లు నిండి, ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్‌పై 1 శాతం కోత విధిస్తారు.

వ‌డ్డీ ఆదాయం: పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ మొత్తాన్ని ప్ర‌తి మూడు నెల‌లకోసారి లెక్కించి ఖాతాకు జ‌మ‌చేస్తారు. విత్‌డ్రా స‌మ‌యంలో అస‌లుతో పాటు వ‌డ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఎంఐఎస్‌లో పెట్టుబడిదారుడు నెలనెలా వ‌డ్డీని తీసుకోవ‌చ్చు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రతి నెలా చెల్లించిన‌ వడ్డీని ఖాతాదారుడు స్వీకరించకపోతే, అలాంటి వడ్డీపై ఎలాంటి అదనపు వడ్డీ ల‌భించ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని