Stock Market: నాలుగో రోజూ కొనసాగిన బుల్‌ జోరు.. మార్కెట్‌లోని మరిన్ని సంగతులు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల్లో వరుసగా నాలుగో రోజూ బుల్‌ జోరు కొనసాగింది. బుధవారం దేశీయ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి....

Updated : 12 Jan 2022 15:49 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల్లో వరుసగా నాలుగో రోజూ బుల్‌ జోరు కొనసాగింది. బుధవారం దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో పాటు పలు దేశీయ సానుకూలతలు సూచీలను ముందుకు నడిపించాయి.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 61,014.37 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. రోజంతా అదే జోరును కొనసాగించింది. ఏ దశలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించలేదు. ఇంట్రాడేలో ఈ సూచీ 61,218.19 - 60,850.93 మధ్య కదలాడి చివరకు 533.15 పాయింట్ల లాభంతో 61,150.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,170.40 వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజులో 18,227.95 - 18,128.80 మధ్య కదలాడింది. చివరకు 156.60 పాయింట్లు లాభపడి 18,212.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.91 వద్ద నిలిచింది.

నిఫ్టీ50 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు

కొనసాగిన ప్రీ-బడ్జెట్‌ ర్యాలీ..

అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆ సంకేతాలతో నేడు ఆసియా సూచీలూ రాణించాయి. అక్కడి నుంచి పాజిటివ్‌ సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లలో ప్రీ-బడ్జెట్‌ ర్యాలీ కొనసాగింది. పైగా ఈరోజు దిగ్గజ ఐటీ కంపెనీల ఫలితాలు వెలువడనుండడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు పెరగడమూ ర్యాలీకి దోహదం చేశాయి. మరోవైపు గత మూడు నెలలుగా అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తున్న స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్స్‌ తిరిగి ర్యాలీ అవుతున్నాయి. వీటితో పాటు దిగ్గజ కంపెనీల షేర్లు రాణించడమూ ఈరోజు సూచీల పరుగుకు దోహదం చేసింది.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌ విక్రయాల్లో త్రైమాసిక ప్రాతిపదికన 28 శాతం వృద్ధి నమోదైంది. దీంతో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 5 శాతం మేర లాభపడ్డాయి.

* అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు ఈరోజు 6.3 శాతం మేర ర్యాలీ అయ్యాయి. గత రెండు సెషన్లలో ఈ స్టాక్‌ 12 శాతం ఎగబాకింది. మూడో త్రైమాసిక ఫలితాలకు సంబంధించిన బలమైన అప్‌డేట్లను వెల్లడించడమే ఈ ర్యాలీకి కారణం.  

* ఎల్‌ఐసీ ఐపీఓకు కంపెనీ ముమ్మర సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ కంపెనీ విలువను రూ.15 లక్షల కోట్లుగా లెక్కగట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.   

* బాండ్ల ద్వారా ఫెడరల్‌ బ్యాంకు రూ.700 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. 

* భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 10 వారాల గరిష్ఠాన్ని తాకాయి. 

* నిఫ్టీ 50 సూచీలో 35 షేర్లు లాభపడితే.. 15 షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని