Stock Market Update: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 7% పతనమైన రిలయన్స్‌ షేర్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి....

Updated : 01 Jul 2022 15:55 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం జూన్‌ నెలకు నష్టాలతో స్వాగతం పలికిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. రిలయన్స్ వంటి దిగ్గజ షేర్ల భారీ పతనంతో సెన్సెక్స్‌ ఓ దశలో 52,094.25 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం నష్టాల్లోనే ముగిశాయి. అలాగే క్రిసిల్‌ దేశీయ వృద్ధి అంచనాలను తగ్గించడం, జూన్‌ నెలలో తయారీ కార్యకలాపాలు 9 నెలల కనిష్ఠానికి చేరడం, ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధించడం వంటి పరిణామాలూ మార్కెట్లపై ప్రభావం చూపాయి.

ఉదయం సెన్సెక్స్‌ 52,863.34 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,053.04 -  52,094.25 మధ్య కదలాడింది. చివరకు 111.01 పాయింట్ల నష్టంతో 52,907.93 వద్ద ముగిసింది. 15,703.70 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 28.20 పాయింట్లు నష్టపోయి 15,752.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,793.95 - 15,511.05 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.03 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

  • ఇంధన ఎగుమతులపై పన్నుతో పాటు ముడి చమురు ఉత్పత్తిపై అదనపు పన్ను విధించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈ రోజు 7 శాతం మేర నష్టపోయాయి. అలాగే ఓఎన్‌జీసీ షేర్లు దాదాపు 14 శాతం వరకు నష్టపోయాయి.
  • జూన్‌ నెల వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బజాజ్‌ ఆటో షేరు ధర ఈరోజు 3 శాతం మేర నష్టపోయింది.
  • ఇటీవలి వరుస నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద జొమాటో షేర్లకు ఈ రోజు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ఈ కంపెనీ షేరు ధర 4.27 శాతం పెరిగింది.
  • జూన్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు 56 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ వసూళ్లు రెండో అత్యధికం కావడం గమనార్హం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని