Stock Market: ఆరంభంలో బడ్జెట్‌ జోష్‌.. నిఫ్టీ @ 17,765

Stock Market: బడ్జెట్‌కి ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా జతయ్యాయి.

Published : 01 Feb 2023 09:30 IST

ముంబయి: మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టనున్న తరుణంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. అయితే, బడ్జెట్‌ (Budget 2023)లోని కేటాయింపులు, వివిధ రంగాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలు నేడు మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 336 పాయింట్ల లాభంతో 59,886 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 102 పాయింట్లు లాభపడి 17,765 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.83 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఐటీసీ, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం నష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ లాభాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. విదేశీ మదుపర్లు నిన్న రూ.5,539.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.4,506.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. జీఎస్‌టీ వసూళ్లు జనవరిలో రూ.1,55,922 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2022 ఏప్రిల్‌లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: టాటా కెమికల్స్‌, అశోక్‌ లేలాండ్‌, బ్రిటానియా, అజంతా ఫార్మా, హిందుస్థాన్‌ కాపర్‌, యూటీఐ ఏఎంసీ, వర్ల్‌పూల్‌, జువారి అగ్రో కెమికల్స్‌, ఐడీఎఫ్‌సీ, రేమండ్‌, జిలెట్‌, ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌, ఆర్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

కోల్‌ ఇండియా: ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.7,755.50 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,558.30 కోట్లతో పోలిస్తే ఇది 70 శాతం అధికం. ఏకీకృత విక్రయాలు రూ.25,990.97 కోట్ల నుంచి 25 శాతం పెరిగి రూ.32,429.46 కోట్లకు చేరాయి.

సన్‌ ఫార్మా: డిసెంబరు త్రైమాసికంలో రూ.2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,059 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.9,863 కోట్ల నుంచి రూ.11,241 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్‌ విక్రయాలు 7 శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరాయి.

ఐఓసీ: డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ.448.01 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,97,168 కోట్ల నుంచి రూ.2,28.168 కోట్లకు పెరిగింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు నష్టపోయిన కంపెనీ, ఈ సమీక్షా త్రైమాసికంలో మళ్లీ లాభాల్లోకి వచ్చింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు పూర్తి స్పందన లభించింది. ఇష్యూలో 4.55 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 5.08 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్లు తమకు కేటాయించిన మొత్తానికి, మూడు రెట్లకు పైగా ఆసక్తి చూపగా, క్యూఐబీ విభాగంలో 1.2 రెట్ల స్పందన దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని