Stock Market: భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లభిస్తుండటంతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Published : 11 Jul 2023 09:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయంగా అందుతున్న సానుకూల సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 19,431 వద్ద, సెన్సెక్స్‌ 240 పాయింట్లు పెరిగి 65,584 వద్ద ట్రేడవుతున్నాయి. మజెగావ్‌ డాక్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, జేకే ఇన్ఫ్రా, పీసీబీఎల్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌ షేర్ల విలువ పెరగ్గా.. కేపీఐటీ టెక్నాలజీస్‌, ఐనాక్స్‌, యూపీఎల్‌, వేదాంత, గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ షేర్ల విలువ కుంగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడి రూ.82.40 వద్ద నేటి ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. 

పన్ను వసూళ్లలో పెరుగుదల ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోదనే సంకేతాలను మార్కెట్‌కు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.75 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. పెట్టుబడులను ఆకర్షించడంలో చైనాను భారత్‌ అధిగమించిందని ఇన్వెస్కో గ్లోబల్‌ సావరిన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. సార్వభౌమ వెల్త్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో సానుకూల నిబంధనలు, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కలిసొస్తున్నాయని తెలిపింది.

ఆసియా స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా సూచీ ఏఎస్‌ఎక్స్‌ 1.17శాతం, షాంఘై ఎస్‌ఈ కాంపోజిట్‌ 0.44 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 1.68శాతం, జపాన్‌ నిక్కీ 0.28శాతం, టీఎస్‌ఈఎస్‌ 50 ఇండెక్స్‌ 1.12శాతం ఎగిశాయి. నిన్నటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లలో కూడా లాభాల జోరు కొనసాగింది. డోజోన్స్‌ 0.6శాతం, నాస్‌డాక్‌ 0.18 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.24శాతం లాభపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని