ఆఖర్లో అమ్మకాలు

ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Published : 01 May 2024 03:44 IST

సమీక్ష

ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఐటీ షేర్లు డీలాపడ్డాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.43 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 74,800.89 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ, 440 పాయింట్ల లాభంతో 75,111.39 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది. ఆఖర్లో అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, 74,346.40 పాయింట్లకు పడిపోయింది. చివరకు 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.55 పాయింట్లు తగ్గి 22,604.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,783.35 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.

  • జేఎన్‌కే ఇండియా షేరు అరంగేట్రం అదిరింది. ఇష్యూ ధర రూ.415తో పోలిస్తే, బీఎస్‌ఈలో 49.39% లాభంతో రూ.620 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71.56% పరుగులు తీసి రూ.712 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 67.21% లాభపడి రూ.693.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3,859.81 కోట్లుగా నమోదైంది.
  • త్రైమాసిక లాభం రెట్టింపు కావడంతో జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు 19.99% దూసుకెళ్లి రూ.599 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని, అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి.. అక్కడే ముగిసింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.1,043.82 కోట్లు పెరిగి రూ.6,264.96 కోట్లకు చేరింది.
  • మార్చి త్రైమాసికంలో రూ.818 కోట్ల నష్టాన్ని చవిచూడటంతో టాటా కెమికల్స్‌ షేరు 2.43% కోల్పోయి రూ.1,072.30 దగ్గర స్థిరపడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 డీలాపడ్డాయి. టెక్‌ మహీంద్రా 2.08%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.50%, టాటా స్టీల్‌ 1.46%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.41%, సన్‌ఫార్మా 1.29%, టీసీఎస్‌ 1.24%, ఎల్‌ అండ్‌ టీ 1.09%, కోటక్‌ బ్యాంక్‌ 1.01%, ఇన్ఫీ 0.97% నష్టపోయాయి. ఎం అండ్‌ ఎం 4.53%, పవర్‌గ్రిడ్‌ 2.71%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌    1.87%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.52%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌  1.27% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో టెక్‌, ఐటీ, లోహ, కమొడిటీస్‌, టెలికాం 0.98 వరకు పడ్డాయి. వినియోగ, ఆర్థిక సేవలు, యుటిలిటీస్‌, వాహన, స్థిరాస్తి, విద్యుత్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 2014 షేర్లు నష్టాల్లో ముగియగా, 1804 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 132 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు మణప్పురం ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ ఆశీర్వాద్‌ మైక్రో ఫైనాన్స్‌కు సెబీ అనుమతి లభించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1500 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది.
  • రైల్వే సిగ్నలింగ్‌ వ్యాపారం కోసం హెచ్‌ఐఎంఏ మిడిల్‌ ఈస్ట్‌ ఎఫ్‌జడ్‌ఈ, దుబాయ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (భెల్‌) తెలిపింది.
  • పైలట్ల శిక్షణలో లోపాలకు గాను విమానయాన సంస్థ విస్తారా అధికారి విక్రమ్‌ మోహన్‌ దయాల్‌ను డీజీసీఏ సస్పెండ్‌ చేసింది.
  • జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి పతంజలి ఫుడ్స్‌ షోకాజ్‌ నోటీసు అందుకుంది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద పొందిన రూ.27.46 కోట్లు ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది.
  • నోకియా డిజిటల్‌ వర్క్‌ప్లేస్‌ సేవల్లో మార్పులు చేసేందుకు మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టును విప్రో దక్కించుకుంది. అంతర్జాతీయంగా నోకియాకు 130 దేశాల్లో 86,700 మంది యూజర్లు ఉన్నారు.
  • కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ జాయింట్‌ ఎండీ కేవీఎస్‌ మణియన్‌ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్‌ తెలిపింది.

నేటి బోర్డు సమావేశాలు: అదానీ పవర్‌, అంబుజా సిమెంట్‌, అదానీ విల్మర్‌, బొండాడ ఇంజినీరింగ్‌, ధంపూర్‌ షుగర్‌, మంగళం సిమెంట్‌, నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌


టాటాప్లేలో 70 శాతానికి టాటాసన్స్‌ వాటా

టాటా ప్లేలో తమ వాటాను 70 శాతానికి టాటా సన్స్‌ పెంచుకుంది. టాటా ప్లేలో సింగపూర్‌ ప్రభుత్వ సంస్థ టెమాసెక్‌కు ఉన్న 10% వాటాను దాదాపు 100 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.835 కోట్ల)కు టాటా సన్స్‌ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా టాటా ప్లే విలువను 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు)గా లెక్కకట్టారు. కరోనాకు ముందు ఈ విలువ 3 బి.డాలర్లు (సుమారు రూ.25000 కోట్లు)గా ఉంది.


నేడు మార్కెట్లకు సెలవు

మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పని చేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేయనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని