Deep fake: స్నేహితుడి ముఖంతో వీడియో కాల్‌.. డీప్‌ ఫేక్‌తో నయా మోసం!

Deep fake video: డీప్‌ ఫేక్‌ వీడియో టెక్నాలజీ సాయంతో జరిగిన మోసం ఇది. వీడియో కాల్‌ ద్వారా కోల్‌ ఇండియా మాజీ ఉద్యోగి నుంచి ఓ నేరగాడు రూ.40వేలు కొట్టేశాడు.

Updated : 11 Nov 2023 17:00 IST

తిరువనంతపురం: టెక్నాలజీ మాటున జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ సాయంతో స్నేహితుడి ముసుగు తొడిగి ఓ నేరగాడు కోల్‌ ఇండియా మాజీ ఉద్యోగికి టోకరా వేశాడు. చెల్లెలికి సర్జరీ అంటూ రూ.40వేలు దోచేశాడు. మరింత దోచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మోసం అని గ్రహించిన సదరు విశ్రాంత ఉద్యోగి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు ఆచూకీ దొరకాల్సి ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన పీఎస్‌ రాధాకృష్ణన్‌ కొయ్‌కోడ్‌లో నివాసముంటున్నారు. కోల్‌ ఇండియా మాజీ ఉద్యోగి అయిన రాధాకృష్ణన్‌కు ఈ ఏడాది జులై 9న ఉదయం గుర్తు తెలీని నంబర్‌ నుంచి వాట్సప్‌లో వరుస మెసేజ్‌లు వచ్చాయి. తనతో పాటు నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన వేణుకుమార్‌ ఫ్యామిలీ ఫొటోలు అవి. అవి చూస్తుండగానే ఓ వాట్సాప్‌ కాల్‌. ‘నేను వేణుని. ప్రస్తుతం దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా. సాయంత్రానికి ముంబయి చేరుకుంటా. చెల్లెలికి సర్జరీ ఉంది. ఓ రూ.40వేలు సర్దగలవా’’ అంటూ విన్నపం. ఏళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తి.. పైగా ఆపత్కాలంలో సాయం అడుగుతున్నాడు.. చేయాలా? వద్దా? వద్దా అనే మీమాంసలో ఉండగా.. మళ్లీ అంతలోనే వీడియో కాల్‌.

మధురవాడలో మద్యం లారీ బోల్తా.. ఎగబడిన జనం

ఎదరుగా తనకెంతగానో పరిచయం ఉన్న వేణు కుమార్‌ ఫోన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఇక అంతే అవతలి ఉన్న వ్యక్తి  వేణూనే అని ధ్రువీకరించుకుని అతడు చెప్పిన ఖాతాకు రూ.40వేలు బదిలీ చేశాడు. గంటల వ్యవధిలో రెండోసారి మరో రూ.35 వేలు కావాలంటూ అడగడంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్‌.. కోల్‌ ఇండియా మాజీ ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న వేణు కుమార్‌ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. అవతలి నుంచి చాలా రోజుల తర్వాత ఫోన్‌ చేసిన మిత్రుడితో పిచ్చాపాటీగా మాట్లాడడం మొదలుపెట్టడంతో రాధాకృష్ణన్‌కు ఆశ్చర్యం వేసింది. దీంతో జరిగిందంతా చెప్పాడు. మోసపోయానని గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మోసం ఇలా..

రాధాకృష్ణన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియో కాల్‌ ద్వారా డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సాయంతో ఈ మోసం జరిగిందని గుర్తించారు. అహ్మదాబాద్‌కు చెందిన కౌశ్‌ల్‌ షాను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నేర చరిత్ర ఉన్న కౌశల్‌.. రాధాకృష్ణన్‌ నుంచి కొట్టేసిన సొమ్మును తెలివిగా ఓ గ్యాంబ్లింగ్‌ సంస్థ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. మూలాలు దొరక్కుకుండా ఉండేందుకు కౌశల్‌ ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. బాధితుడి కంపెనీ ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఈ వివరాలు తస్కరించి మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో షేక్‌ ముర్తుజామియా భాయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేదల పేరిట నకిలీ బ్యాంక్‌ అకౌంట్లు తెరిచి విక్రయించే షేక్‌.. బ్యాంక్‌ ఖాతా విషయంలో కౌశల్‌కు సహాయపడినట్లు గుర్తించారు. గుజరాత్‌లో అతడిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సాయంతో ఈ తరహా మోసం జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు