Updated : 28 Aug 2020 09:27 IST

రంగు పూసి.. మాయ చేసి..!

వృద్ధులు, మధ్య వయసు మహిళలే లక్ష్యంగా దొంగనోట్ల మారకం

భవానీపురం: అసలు కరెన్సీ నోట్లను పోలిన కలర్‌ జెరాక్స్‌ నోట్లను మారుస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను భవానీపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భవానీపురం అవుట్‌ఏజెన్సీ వద్ద ఒక దుకాణంలో ఆ నోట్లను మార్చుతుండగా వారిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...విజయవాడ నగరం భవానీపురం దర్గా ప్రాంతంలో నివాసం ఉండే మహ్మద్‌ ఖాసిం ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కరకట్ట ప్రాంతంలో ఉంటున్న మహ్మద్‌ రూబుల్లా అలియాస్‌ బడే ఆటోడ్రైవర్‌గా పని చేస్తాడు. గొల్లపూడి హరిజనవాడలో ఉండే కన్నా శ్రీనివాసరావు ప్రైవేటు పాఠశాలలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మహ్మద్‌ ఖాసిం గతంలో సౌదీ, సూడాన్‌, లిబియాలో కొన్నేళ్ల పాటు పని చేసి వచ్చి వివాహం చేసుకుని నేడు ఏలూరురోడ్డులోని ఏసీలు విక్రయించే దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ ముగ్గురు కలిసి.. అసలు నోట్లను స్కానింగ్‌ చేసి కలర్‌ ప్రింట్లు తీసి వాటిని మార్చి సొమ్ము చేసుకోవాలని భావించారు. అందుకు ఖాసిం తాను పని చేసే దుకాణాన్ని వేదికగా చేసుకున్నాడు. అక్కడ నోట్లను స్కానింగ్‌ చేసి ప్రింట్లు తీశాడు. వృద్ధులు, మధ్య వయసు మహిళలు ఉండే దుకాణాల్లో వాటిని మార్చాలని నిర్ణయించుకున్నారు. అలాగే రాత్రి వేళల్లో రోడ్లపై సంచరిస్తూ నోట్లను మారుస్తున్నారు. ఈ క్రమంలో భవానీపురం అవుట్‌ ఏజెన్సీ వద్ద దుకాణం నిర్వహిస్తున్న విజయలక్ష్మి(45) వద్దకు గురువారం తెల్లవారుజామున వెళ్లారు. ఆమెకు రూ.500 నోటు ఇచ్చి శీతలపానియాలు, సిగిరెట్లు తీసుకున్నారు. ఆమె వద్ద చిల్లర లేకపోవటంతో రూ.500 నోటును సమీపంలోని పెట్రోలు బంకు వద్దకు ఆమె తీసుకువెళ్లి ఇచ్చి చిల్లర అడిగింది. వారు పరిశీలించి ఇది దొంగ నోటని చెప్పారు. దీనితో స్థానికుల సాయంతో ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి 6 కలర్‌ జెరాక్స్‌ రూ.500లు నోట్లు, రెండు రూ.100 నోట్లు, ఒక ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరికొందరి పాత్రపై అనుమానం..: ఈ నోట్లను మార్చడంలో మరికొందరి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ ముగ్గురి వెనుక ఎవరైనా ఉన్నారా..? నిజంగా వాటిని వారే తయారు చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. ఖాసిం పని చేసే దుకాణం యజమానిని కేసులో చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేసును దర్యాప్తు చేస్తున్నామని, దానిలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts