Student murder: నాలుగో తరగతి గిరిజన విద్యార్థి దారుణ హత్య

వసతిగృహంలో ఉండి నాలుగో తరగతి చదువుతున్న కొండ రెడ్డి తెగకు చెందిన గిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని పులిరాముడుగూడెంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Updated : 13 Jul 2023 18:58 IST

వసతిగృహంలో నిద్రపోతుండగా ఎత్తుకెళ్లిన ఆగంతుకులు
ఏలూరు జిల్లా పులిరాముడుగూడెంలో దారుణం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: వసతిగృహంలో ఉండి నాలుగో తరగతి చదువుతున్న కొండ రెడ్డి తెగకు చెందిన గిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని పులిరాముడుగూడెంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మన్యంలోని మారుమూల గ్రామమైన ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి వాలంటీరు, భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఆరో తరగతి, అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) నాలుగో తరగతి పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ వసతిగృహంలో చదువుతున్నారు. సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా ఇద్దరు ఆగంతుకులు వసతిగృహం లోపలికి ప్రవేశించారు. విద్యుత్తు సరఫరా నిలిపివేసి, అఖిల్‌వర్ధన్‌రెడ్డిని ఎత్తుకుని బయటికి తీసుకెళ్లారు. బాలుణ్ని హత్య చేసి, దగ్గరలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. పీక నొక్కి, కళ్లపై గుద్ది చంపినట్లు మృతదేహంపై ఆనవాళ్లు ఉన్నాయి. ‘బతకాలనుకున్న వారు వెళ్లిపోండి. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లు మీ ×××’ అని రాసి ఉన్న లేఖను బాలుడి చేతిలో పెట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌తో నిందితుల కోసం గాలిస్తున్నారు.

పథకం ప్రకారమే చంపేశారా?

ఎవరో కావాలని ఒక పథకం ప్రకారం ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థుల మధ్య ఏమైనా గొడవ జరిగిందా, మృతుని కుటుంబంపై ఎవరైనా కక్ష పెట్టుకుని హత్య చేసి ఉండొచ్చా తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటలు దాటాక ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విద్యుత్తు సరఫరా నిలిపేయడం, గదిలోకి దూరడం తాను చూసినా భయంతో చెప్పలేకపోయానని ఒక విద్యార్థి తెలిపాడు. వాచ్‌మన్‌ విధుల్లో లేకుండా బయటకు వెళ్లినట్లు పలువురు సిబ్బంది చెబుతున్నారు. అయితే తాను పాత భవనంలోని ఒక గదిలో నిద్రిస్తున్నానని అతను తెలిపాడు. ఆవరణలో ఉన్న సోలార్‌ లైటు పనిచేయడం లేదు. ఈ ఘటనలో పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.చిన్నగంగరాజు, డిప్యూటీ వార్డెన్‌ కె.శ్రీనివాస్‌, నైట్‌ వాచ్‌మన్‌ ఎం.రాజేష్‌లను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని