icon icon icon
icon icon icon

మహిళా అభ్యర్థులు.. ప్రచారంలో రుద్రమలు!

‘నలుగురు మహిళలను తోడుగాతీసుకొని.. పార్టీ కండువా వేసుకొని కరపత్రాలు ఇస్తూ వెళ్తారు. మా.. అంటే సొంతూరు, ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో తిరిగి ప్రచారం చేసుకుంటారు. మిగతా నియోజకవర్గం మొత్తం భర్తో, తండ్రో, అన్నో.. చూసుకుంటారు’

Updated : 09 May 2024 07:17 IST

చురకలు, పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై దూకుడు
స్థానిక అంశాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్తూ..
ఔరా అనిపిస్తున్న ఎన్డీయే అభ్యర్థినులు
ఈనాడు, అమరావతి

‘నలుగురు మహిళలను తోడుగాతీసుకొని.. పార్టీ కండువా వేసుకొని కరపత్రాలు ఇస్తూ వెళ్తారు. మా.. అంటే సొంతూరు, ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో తిరిగి ప్రచారం చేసుకుంటారు. మిగతా నియోజకవర్గం మొత్తం భర్తో, తండ్రో, అన్నో.. చూసుకుంటారు’

మహిళా అభ్యర్థి ప్రచారం అంటే.. దాదాపు ఎక్కువ మందికి ఉండే అభిప్రాయం ఇది.

కానీ, ఇదంతా తప్పని ఎన్డీయే మహిళా అభ్యర్థులు ప్రజా క్షేత్రంలో రుజువు చేస్తున్నారు. ప్రజాసేవ కోసం బరిలోకి దిగాం.. పైపై ప్రచారంతో ఎందుకు సరిపెడతామని చురకలు, విమర్శలు, తక్షణ సాయాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అన్నీ తామై.. ఇంట్లో మగవాళ్లకూ మార్గనిర్దేశం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మహిళలు, కొత్తవారు.. అని తేలిగ్గా తీసుకున్న ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అధికార పార్టీ దందాలను తూర్పారబడుతున్నారు. సొంత నియోజకవర్గాల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి భరోసా ఇస్తున్నారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి తరఫున బరిలో నిలిచిన వారిలో పలువురు మహిళా అభ్యర్థులు.. ఊహించని విధంగా ప్రచారంలో దూసుకెళ్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వైవిధ్యతనూ చూపిస్తూ ప్రతి ఇంటి గడపను తడుతూ, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.


ఉప ముఖ్యమంత్రికి చెమటలు పట్టిస్తున్న మాధవీరెడ్డి

 

నియోజకవర్గం: కడప (వైఎస్సార్‌ జిల్లా)
కుటుంబ నేపథ్యం: రాజకీయం
ప్రచార శైలి: బస్తీమే సవాల్‌!


కడప అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మాధవీరెడ్డి.. వైకాపా అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు చెమటలు పట్టిస్తున్నారు. డిప్యూటీ సీఎం, అతని సోదరుడు ఐదేళ్లలో చేసిన దందాలను తూర్పారబడున్నారు. ‘బస్తీమే సవాల్‌’ అనేలా వారికి దీటుగా ‘మాటకు మాట’ అనేలా ప్రచారం చేస్తున్నారు. మాధవిరెడ్డి ఇంట్లోకి చొరబడి కొడతామని కొద్దిరోజుల కిందట పోలీస్‌స్టేషన్‌ బయటే అంజాద్‌బాషా సోదరుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపగా.. మాధవిరెడ్డి అవే అస్త్రంగా వాడుతున్నారు. ‘వీళ్లు మళ్లీ గెలిస్తే ప్రతి ఒక్కరూ అభద్రతాభావంలో బతకాల్సిందే. అందరి ఇళ్లలోకి వచ్చి కొడతామంటారు’ అని సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధి అంటే.. ప్రతివీధిలో గంజాయి అందుబాటులో ఉంచడమే అనుకుంటున్నారని వైకాపా నేతలపై చురకలు వేస్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలోని హామీలతోపాటు, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈమె దూకుడు చూసినోళ్లంతా.. తెదేపాకు ఇన్నేళ్లకు సరైన అభ్యర్థి దొరికారంటూ చర్చించుకుంటున్నారు.


ప్రచారం గల్లా మాధవి దూకుడు!

నియోజకవర్గం: గుంటూరు పశ్చిమ (గుంటూరు)
ప్రచార శైలి: స్థానిక సమస్యలే ఆయుధం

గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గల్లా మాధవికి రాజకీయాలు కొత్తే. అయితేనేం.. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను కలియదిరిగారు. అన్ని సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇటీవల చంద్రబాబుతో కలిసి గుంటూరు నగరంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో కారుపై చంద్రబాబు కూర్చుంటే.. మాధవి వాహనానికి ఓ వైపు వేలాడుతూ ప్రయాణించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. వైకాపా అభ్యర్థి, మంత్రి విడదల రజని స్థానికేతరురాలని, తాను లోకల్‌ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని అవే ఆయుధంగా ఎక్కడికక్కడ హామీలు ఇస్తూ సాగుతున్నారు.


దందాలు చేయను.. అభివృద్ధి చూపిస్తా.. శ్రావణిశ్రీ

నియోజకవర్గం: శింగనమల (అనంతపురం జిల్లా)
కుటుంబ నేపథ్యం: రాజకీయం
ప్రచార శైలి: ఆత్మీయత పంచుతూ.. వైకాపా అరాచకాలు వివరిస్తూ..

‘నేను చదువుకున్నాను. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. ఆలోచించి ఓటేయండి’ అంటూ ముందుకెళ్తున్నారు.. శ్రావణిశ్రీ. టికెట్‌పై ముందే స్పష్టత రావడంతో కొంత కాలంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వైకాపా ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి అరాచకాలను ఓటర్లకు వివరించడంలో సఫలీకృతులవుతున్నారు. సాంబశివారెడ్డి ఇప్పటి వరకూ భార్యను ఎమ్మెల్యేగా గెలిపించి దందా చేశారని, ఇప్పుడు తన వద్ద పనిచేసే వ్యక్తికి టికెట్‌ ఇప్పించుకొని ఆ దందాలు కొనసాగించాలని చూస్తున్నారంటూ ప్రజలు ఆలోచించేలా చేస్తున్నారు. గ్రూపులన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి, నాయకులను కలుపుకొనిపోతున్నారు. మాట తీరుతో ఆకట్టుకోవడం, ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం, చిన్నపిల్లల్ని ఎత్తుకొని లాలించడం, మహిళలను ఆలింగనం చేసుకోవడం, పెద్దవారి ఆశీస్సులు తీసుకోవడం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.


మీ సవితమ్మ.. పక్కా లోకల్‌

నియోజకవర్గం: పెనుకొండ (శ్రీసత్యసాయి)
వృత్తి: వ్యాపారం
కుటుంబ నేపథ్యం: రాజకీయం
ప్రచార శైలి: ఉదయం పట్టణంలో.. ఆ తర్వాత పల్లెపల్లెకూ

సవిత ఇప్పటికే తన పరిధిలోని అన్ని ఊళ్లను చుట్టేశారు. వైకాపా అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌ను పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘కళ్యాణదుర్గం నుంచి చెత్తను తెచ్చి.. పెనుకొండలో వేశారు. అక్కడి చెత్త.. ఇక్కడికొచ్చాక బంగారంగా మారిపోతుందా?’ అని ఉషశ్రీ చరణ్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రశ్నిస్తున్నారు. ‘మీ పెనుకొండ.. మీ సవితమ్మ’ అనే నినాదంతో స్థానికురాలినంటూ ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన శంకరనారాయణ, కొంతకాలం మంత్రిగా పనిచేసి అందరినీ ఇబ్బందిపెట్టి వెళ్లిపోయారని ప్రజలకు వివరిస్తున్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. తెదేపాలో సీనియర్లు, జూనియర్లను కలుపుకొనిపోతున్నారు. నిత్యం ఉదయం పెనుకొండ పట్టణంలో ప్రచారంచేసి, తర్వాత పల్లెల్లోకి వెళ్తున్నారు.


చదువుకున్నా.. చక్కదిద్దుతానంటున్న నాగమాధవి

నియోజకవర్గం: నెల్లిమర్ల (విజయనగరం జిల్లా)
వృత్తి: ఐటీ సంస్థ ప్రెసిడెంట్‌
కుటుంబ నేపథ్యం: రాజకీయం
ప్రచార శైలి: ఊరూరా తిరగడం, రోడ్‌షోలు

‘ఉన్నత విద్య చదివాను. ఐటీతోపాటు, ఇతర పరిశ్రమలు వచ్చేలా చేసే సత్తా, పరిచయాలు ఉన్నాయి. కచ్చితంగా ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తా’ అంటూ నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి ముందుకెళ్తున్నారు. నాగమాధవి ఎన్‌డీఏ అభ్యర్థిగా టికెట్‌ సాధించడమే ఓ సంచలనం. అప్పటి వరకూ తెదేపా టికెట్‌ కోసం యత్నించిన కర్రోతు బంగార్రాజుతో చర్చించి, ఆయన్ను సర్దుబాటుచేసి, ఇప్పుడు ఆయనే ప్రచారంలో పాలుపంచుకునేలా చేయగలిగారు. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రచారంలో పాల్గొంటున్నారు. వైకాపా అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడుపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. పల్లెపల్లెల్లో ప్రచారం పూర్తిచేసి, రోడ్‌షోలు మొదలుపెట్టారు.


ఇలా వచ్చి.. అలా దూసుకెళ్తున్న గొట్టిపాటి లక్ష్మి

నియోజకవర్గం: దర్శి (ప్రకాశం జిల్లా)
వృత్తి: వైద్యం
కుటుంబ నేపథ్యం: రాజకీయం, వైద్యం
ప్రచార శైలి: ఆపన్న హస్తం అందిస్తూ..

కూటమి అభ్యర్థిగా ప్రకటించగానే.. వేల మంది కార్యకర్తల ర్యాలీతో నియోజకవర్గంలో అడుగుపెట్టారు.. లక్ష్మి. అదే స్ఫూర్తితో కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంపై పట్టు సాధించారు. కురిచేడు మండలంలో ప్రచారంలో ఉండగా దర్శిలోని ఓ ఆసుపత్రిలో గర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతోందని తెలుసుకొని వెంటనే వెళ్లి సిజేరియన్‌ చేసి పురుడు పోశారు. ప్రచారాన్ని పక్కనపెట్టి, వైద్యురాలిగా ఆమె చూపిన చొరవను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిసింది. దర్శిలో ఆసుపత్రి ఏర్పాటుచేసి, అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరిస్తామంటూ, గత తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, వైకాపా చేసిన విధ్వంసాలను వివరిస్తున్నారు. ఇప్పటికే దర్శిలోని 20 వార్డుల్లో ఓ దఫా ప్రచారం పూర్తిచేశారు.


సొంత బిడ్డలా.. సింధూరారెడ్డి

నియోజకవర్గం: పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా)
కుటుంబ నేపథ్యం: రాజకీయం
ప్రచార శైలి: సంక్షేమం, అభివృద్ధి నినాదంతో..

ప్రతి గడప తడుతూ.. వారి ఇంటి బిడ్డలా పలకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కేరళ మాజీ డీజీపీ కుమార్తె సింధూరారెడ్డి. సాధారణ మహిళలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గతంలో ఆమె మామ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో నియోజకవర్గంపై, అక్కడి సమస్యలపై పట్టు ఉంది. వాటినే ఇప్పుడు ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నమస్కరించి ఓటు అడగటంతోపాటు, వృద్ధులు, పెద్దవారుంటే ఆశీర్వాదం తీసుకుంటున్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసినా, ఒక్క ప్రభుత్వ కార్యాలయమూ నిర్మించలేకపోయారని, ఐదేళ్లలో అభివృద్ధే లేదని, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఇసుక, సహా అన్నింటా దోపిడీకి పాల్పడ్డారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి.. ఇలా రెండూ కావాలంటే తెదేపాను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మీ ఇంటికి మీ దివ్య

నియోజకవర్గం: తుని (కాకినాడ)
కుటుంబ నేపథ్యం: రాజకీయం
ప్రచార శైలి: సామాజిక వర్గాల ఆత్మీయతతో..

తండ్రి యనమల రామకృష్ణుడు వారసురాలిగా తుని నుంచి తెదేపా తరఫున బరిలో ఉన్న యనమల దివ్య.. అందరినీ కలుపుకొని ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన మేలు, వైకాపా నిలిపేసిన పథకాలు వివరిస్తున్నారు. తండ్రి యనమల, మాజీ ఎమ్మెల్యే అశోక్‌ అనుభవం దివ్యకు కలిసి వస్తోంది. ఏ మండలానికి వెళ్లినా అక్కడి సమస్యలనే ప్రత్యర్థులపై అస్త్రంగా ఎక్కుపెడుతున్నారు. ‘మీ ఇంటికి మీ దివ్య’ అనే నినాదంలో ముందుకెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img