Mulugu: కొండాయి.. గుండె పగిలింది

ఏటూరునాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాయిని ఊహించని వరద ముంచెత్తి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామ సమీపంలోని జంపన్నవాగు వరద ఎనిమిది మందిని బలిగొంది.

Updated : 29 Jul 2023 08:10 IST

ఊహించని విపత్తుకు 8 మంది ప్రాణాలు బలి
జంపన్నవాగులో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం(Eturnagaram) మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాయిని ఊహించని వరద ముంచెత్తి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామ సమీపంలోని జంపన్నవాగు వరద ఎనిమిది మందిని బలిగొంది. గురువారం వరదలో కొట్టుకుపోయి గల్లంతైన వారంతా విగతజీవులయ్యారు. ఊరు మునుగుతుందేమోననే భయమే వారిని మృత్యు ఒడిలోకి చేర్చింది. సురక్షిత ప్రాంతానికి వెళ్దామనుకుని నీటిలో మునిగిపోయారు. కొండాయి గ్రామానికి చెందిన మహమ్మద్‌ మజీద్‌ఖాన్‌ (75) ఆయన భార్య లాల్‌బీబీ (65), షేక్‌ మహబూబ్‌ఖాన్‌ (60), మహమ్మద్‌ షరీఫ్‌ (55) ఆయన కుమారుడు అజార్‌ (22), మహమ్మద్‌ రషీద్‌ (52), ఆయన భార్య కరీమా (42), కొండాయి గోవిందరాజులు దేవాలయ ప్రధాన పూజారి తల్లి దబ్బకట్ల సమ్మక్క (75)లు గురువారం రాత్రి గల్లంతయ్యారు. వారికోసం గ్రామస్థులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నానికి మృతదేహాలు లభ్యమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. బుధవారం రాత్రి నుంచి చిన్నగా పెరిగిన వరద గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక్కసారిగా పోటెత్తింది. గ్రామస్థులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో చనిపోయినవారి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వరద పెరుగుతుండగా వీరు మల్యాల గ్రామానికి వెళ్లేందుకు పయనమయ్యారు. రోడ్డు వెంట నడుస్తూ రెండు ఊళ్ల మధ్యకు రాగానే హఠాత్తుగా వరద ఎక్కువై.. వారంతా గల్లంతయ్యారు.

కల్వర్టు వల్లే ప్రమాదం

కొండాయి, మల్యాల మధ్యన కొత్త కల్వర్టు నిర్మించారు. సిమెంట్‌ పైపులు వేసి మట్టి పోసి వదిలేశారు. డబుల్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా పాత కల్వర్టును తొలగించి దీన్ని నిర్మించారు. వరద తాకిడికి ఆ కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోవడంతో లోతుగా ఒర్రె ఏర్పడింది. మల్యాల వైపు పయనమైన బాధితులు 8 మందీ.. రోడ్డే అనుకుని నడుస్తూ ఒక్కసారిగా ఆ ఒర్రెలో పడి.. కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో రషీద్‌ గజ ఈతగాడైనా వరద ఒత్తిడిని ఎదుర్కోలేక ప్రాణాలు కోల్పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు