Pension: పింఛను తొలగించారని అంధురాలి ఆత్మహత్య

పింఛను తొలగించారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి తండాకు చెందిన అంధురాలు, గిరిజన మహిళ సరోజమ్మ (40) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.

Updated : 10 Dec 2023 07:31 IST

గుంతకల్లు, న్యూస్‌టుడే: పింఛను తొలగించారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నక్కనదొడ్డి తండాకు చెందిన అంధురాలు, గిరిజన మహిళ సరోజమ్మ (40) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. వివాహ వేడుకలో పాల్గొనడానికి కుటుంబసభ్యులు వేరే గ్రామానికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె పురుగుల మందు తాగింది. ఇంటికొచ్చిన కుటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుంతకల్లు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. పుట్టినప్పటినుంచి అంధురాలైన ఆమెకు చాలా కాలం నుంచి ప్రభుత్వం పింఛను ఇస్తోంది. ఆమె తమ్ముడు కుళ్లాయిస్వామి నాయక్‌కు రైల్వేలో ఏడాదిన్నర కిందట ఉద్యోగం వచ్చింది. ఒకే రేషన్‌కార్డులో కుటుంబసభ్యుల పేర్లు ఉండటంతో ప్రభుత్వం ఏడాదినుంచి సరోజమ్మ పింఛనును ఆపేసింది. ఆమె తండ్రి ఏడేళ్ల కిందట చనిపోయారు. ముగ్గురు తమ్ముళ్లు, తల్లితో కలిసి ఆమె ఉంటున్నారు.  పింఛను రాకపోవడంతో మనోవేదనకు గురై ఆమె అనారోగ్యం పాలైంది. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని సోదరులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని గ్రామీణ ఎస్సై సురేశ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని