Medak: పెళ్లి బృందంపైకి కారు.. యువతి దుర్మరణం

పెళ్లికూతురిని మెట్టినింటికి పంపించాక జరిగిన గొడవలో, అక్కడున్నవారిపైకి ఓ వ్యక్తి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా, పలువురు గాయపడిన ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి జరిగింది.

Updated : 05 Jan 2024 13:13 IST

పరారీలో కారుతోలిన యువకుడు

చేగుంట, న్యూస్‌టుడే: పెళ్లికూతురిని మెట్టినింటికి పంపించాక జరిగిన గొడవలో, అక్కడున్నవారిపైకి ఓ వ్యక్తి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా, పలువురు గాయపడిన ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక ఎస్సై హరీశ్‌ తెలిపిన ప్రకారం.. రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ వివాహం గురువారం జరిగింది. రాత్రి ఆనందంగా ఊరేగింపు నిర్వహించి ఆమెను కామారెడ్డి జిల్లా బికనూరు మండలం లక్ష్మిదేవిపల్లికి సాగనంపారు. అనంతరం ఇంటికి వస్తుండగా, అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్‌, స్వామి గొడవపడ్డారు.

ఈ సమయంలో నరేందర్‌, స్వామిని నెట్టివేయడంతో కిందపడ్డాడు. అక్కడున్న వారు అతన్ని పక్కను తీసుకెళ్లారు. దీంతో నరేందర్‌ ఆగ్రహంతో తన కారు (థార్‌)ను తెచ్చి అక్కడ ఉన్నవారిపైకి ఎక్కించడంతో రమ్య (23), ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్‌ తరలిస్తుండగా మరణించింది. దుర్గయ్య, సుజాత, సురేష్‌ను నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యాదగిరిని కామారెడ్డికి పంపించారు. రమ్య డిగ్రీ పూర్తి చేసింది. కారును వారిపైకి తోలుతున్న సమయంలో భీంరావుపల్లికి చెందిన యాదగిరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో పూర్తిగా ధ]్వంసం అయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డాడు. బైక్‌ అడ్డులేకపోతే చాలా మంది తీవ్రంగా గాయపడేవారని ఎస్సై తెలిపారు. నరేందర్‌ పరారీలో ఉన్నాడన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని