విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం

Updated : 07 May 2024 21:17 IST

నలుగురి అరెస్ట్‌
ట్రేడింగ్‌ పేరుతో ఆ ఖాతాలకు రూ.22.24 కోట్లు జమచేయించుకున్న ముఠా
హైదరాబాద్‌ వాసికి రూ. 1.08 కోట్ల టోకరా

ఈనాడు, హైదరాబాద్‌: కమీషన్ల కోసం బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటిని విదేశీ నేరస్థులకు విక్రయిస్తున్న నలుగురిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం ఈ ముఠా వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాకు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థి కృష్ణ ఢాకా (25), వైద్యుడు మనోజ్‌కుమార్‌ (27), ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మాజీ ఉద్యోగి అశుతోష్‌రాజ్‌(29), దిల్లీ రోహిణి ప్రాంతానికి చెందిన మునిష్‌ బన్సల్‌ ముఠాగా ఏర్పడ్డారు. అశుతోష్‌రాజ్‌ బ్యాంకుల్లో తనకు పరిచయమున్న ఉద్యోగులను మచ్చిక చేసుకొని నకిలీ కేవైసీ వివరాలతో కరెంట్‌ బ్యాంకు ఖాతాలు తెరిచి మనోజ్‌కుమార్‌, కృష్ణ, బన్సల్‌కు అప్పగించేవాడు. ఈ ముగ్గురు ఆయా ఖాతాలను దుబాయ్‌లోని సైబర్‌ మోసగాళ్లకు విక్రయించేవారు. దుబాయ్‌కు చెందిన సైబర్‌ నేరస్థులు.. ట్రేడింగ్‌ పేరుతో ఈ ఖాతాల్లోకి నగదు జమ చేయించుకొని మోసం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బాధితుడికి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సప్‌ మెసేజ్‌లు పంపారు. తమను తాము ‘పాంథియోన్‌ వెంచర్‌’ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. స్టాక్‌ ట్రేడింగ్‌ మెలకువల్ని ఉచితంగా నేర్పించేందుకు తాము కొందరిని ఎంచుకుంటున్నట్లు తెలిపారు. తాము సూచించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చని చెప్పారు. బాధితుడు అందుకు అంగీకరించడంతో ట్రేడింగ్‌ ఖాతాను తెరిపించారు. ‘ఆదిత్య స్టాక్‌ షేరింగ్‌ వీఐపీ’ పేరిట ఏర్పాటు చేసిన వాట్సప్‌ గ్రూప్‌లో చేర్పించారు. ‘పీటీ-వీసీ’ పేరిట గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించారు. అనంతరం ఐపీవో స్టాక్స్‌ కొనుగోలు పేరుతో బాధితుడి నుంచి రూ.1.08 కోట్లను పలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు. అనంతరం స్పందించడం మానేయడంతో బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితుడు నగదు జమ చేసిన ఖాతాల వివరాలపై ఆరా తీయగా.. ఈ నలుగురు నిందితుల నేరం బయటపడింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో సుమారు రూ.22.24 కోట్లు ఈ ఖాతాలకు జమైనట్లు తేలింది. ఈ ముఠాపై పలు రాష్ట్రాల్లో 171 కేసులు నమోదైనట్లు గుర్తించారు. రాష్ట్రంలోనూ 11 కేసులున్నట్లు వెల్లడైంది. నిందితుల ఖాతాల్లోని రూ.28.94 లక్షలను జప్తు చేయించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని