ATM: ఏటీఎంలో కెమెరాలకు రంగేశారు... 41 లక్షలు కొట్టేశారు

కడప నగరం సమీపంలో రెండు చోట్ల ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన దుండగులు రూ.41 లక్షలు అపహరించారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో...

Updated : 08 Dec 2021 06:50 IST

రెండు ఏటీఎంలలో దుండగుల చోరీ

నల్లరంగుతో సీసీ కెమెరాలు

కడప నేరవార్తలు, చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: కడప నగరం సమీపంలో రెండు చోట్ల ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన దుండగులు రూ.41 లక్షలు అపహరించారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. సోమవారం అర్ధరాత్రి దాటాక దుండగులు సీసీ కెమెరాలకు నల్లని రంగు పూశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను తెరిచి, రూ.17 లక్షలు తీసుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది మంగళవారం చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రిమ్స్‌ ఠాణా పరిధిలోనూ రామాంజినేయపురం ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి ఆగంతుకులు రూ.24 లక్షలు దోచుకెళ్లారు. ఇక్కడా గ్యాస్‌ కట్టర్‌తోనే ఏటీఎంను తెరిచారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాగిలాలతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఓ కారు కాలిపోయి ఉంది. చోరులకు ఆ కారుకు సంబంధముందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ధ్వంసమైన ఏటీఎం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని