Leopard: చిన్నారులను చంపుతోన్న చిరుత.. 10రోజుల్లో ముగ్గురి మృత్యువాత

ఝార్ఖండ్‌లోని ఓ జిల్లాలో చిరుత స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. ఇలా 10 రోజుల్లో ముగ్గురు బాలికలను ఈ చిరుత పులి పొట్టనపెట్టుకున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. 

Updated : 20 Dec 2022 15:43 IST

రాంచీ: ఝార్ఖండ్‌లోని గాడ్వా జిల్లాలో ఓ చిరుత (Leopard) వణికిస్తోంది. పలామూ డివిజన్‌లో వరస దాడులకు పాల్పడుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారిని పొట్టనపెట్టుకుంది. గడిచిన 10రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులు చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే, ఈ ముగ్గురినీ చంపింది ఒకే చిరుతేనని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గర్వా జిల్లాలో (Garhwa Division) సేవదీ గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి తన ఇంటి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లింది. అదే సమయంలో చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసిన చిరుత (Leopard) .. బాలిక మెడను పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన గ్రామ ప్రజలు.. కర్రలు పట్టుకొని పులిని వెంబడించారు. జనాలను చూసిన ఆ క్రూరమృగం బాలికను వదిలి అడవిలోకి పారిపోయింది. అయితే, అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. గడిచిన 10 రోజుల వ్యవధిలో ఇది మూడో మరణం కావడం గమనార్హం.

డిసెంబర్‌ 14న అదే జిల్లాకు చెందిన భాందారియా ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి కూడా చిరుత దాడిలో హతమయ్యింది. అంతకుముందు డిసెంబర్‌ 10వ తేదీన లాతేహర్‌ జిల్లాలో ఓ 12ఏళ్ల బాలిక పులి దాడిలో చనిపోయింది. అయితే, ఈ ముగ్గురిని చంపింది ఒకే చిరుత అని భావిస్తున్నామని గాడ్వా డివిజన్‌ అటవీ అధికారి శశి కుమార్‌ వెల్లడించారు. చిరుతను బంధించేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన.. దానిని మనుషులను తినే జంతువుగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున చట్ట ప్రకారం పరిహారం అందిస్తామని అటవీ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని