Crime news : తాను శివుడి అవతారమట.. తిరిగి బతికిస్తానని చెప్పి వృద్ధురాలిని గొడుగుతో కొట్టి చంపాడు!

రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి 85 ఏళ్ల వృద్ధురాలిని గొడుగుతో కొట్టి చంపాడు.

Published : 06 Aug 2023 15:48 IST

జైపుర్ : రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రంలోని ఉదయ్‌పుర్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తనను తాను శివుడి అవతారంగా పేర్కొన్న ఓ 60 ఏళ్ల వ్యక్తి.. 85 ఏళ్ల వృద్ధురాలిపై గొడుగుతో దాడి చేసి హతమార్చాడు. పక్కనే ఇద్దరు మైనర్‌ బాలురు ఈ ఘటనను చూస్తూ ప్రేక్షకపాత్ర వహించారు. అందులో ఒకరు ఆ దాడి దృశ్యాలను చిత్రీకరించారు. మృతురాలిని తిరిగి బతికిస్తానని చెప్పి నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.  

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.77 లక్షల విలువైన బంగారం స్వాధీనం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగాడు. ఆ తరువాత అతడికి కల్కిబాయ్‌ గమేతి అనే వృద్ధురాలు కనిపించింది. మద్యం మత్తులో తనను తాను శివుడి అవతారంగా భావించిన ఆ వ్యక్తి ఆ మహిళను చంపి తిరిగి బతికించాలనుకున్నాడు. వృద్ధురాలి పక్కన కూర్చొని తాను శివుడి అనుచరుడినని చెప్పాడు. ‘నువ్వు మహారాణివి’ అంటూ వెంటనే ఆమె ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ దెబ్బలకు తాళలేక వృద్ధురాలు నేలపై పడిపోయింది. వెంటనే ఆమె జుట్టు పట్టుకుని కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత గొడుగు తీసుకొని చితకబాదాడు. దాంతో వృద్ధురాలు మరణించింది. 

గోగుండా తహసీల్‌ పరిధిలో ఈ హత్య చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇది ఆదివాసీలు ఎక్కువగా నివసించే కొండ ప్రాంతం. సమీపంలోని వారి ఇంటికి వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా నిందితుడు ఆమెకు తారసపడ్డాడని పోలీసులు చెప్పారు. ఈ హత్యను ఇద్దరు మైనర్లు వీడియో తీశారని, మరో వ్యక్తి ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాడని ఉదయ్‌పూర్‌ ఎస్పీ భువన్‌ భూషణ్‌ వెల్లడించారు. చనిపోయిన మహిళ మంత్రగత్తె కావడంతోనే వృద్ధుడు హత్యకు పాల్పడ్డాడనే వదంతులను ఆయన తోసిపుచ్చారు. ఈ కేసులో మొత్తం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని