Crime News: వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభానీ అరెస్టు

‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను....’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన...

Updated : 23 Nov 2022 11:12 IST

ఒంగోలు: ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను....’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. గుప్తాపై దాడి చేసిన సుభానీని అరెస్టు చేసినట్టు డీఎస్పీ నాగరాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. 

ఏం జరిగిందంటే?

ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.... మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు. ‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా..నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్‌.. ప్లీజ్‌...’ అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్‌, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు. సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు.  ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని