logo

కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి

ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో ఉన్నవారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన రవాణా శాఖ ఉన్నతోద్యోగి శ్యామ్‌నాయక్‌ ఉద్యోగాన్ని వదిలో ఓ ప్రధాన రాజకీయ పార్టీలో చేరగా...

Published : 22 Oct 2023 04:57 IST

దండేపల్లి, (మంచిర్యాల), న్యూస్‌టుడే

ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో ఉన్నవారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన రవాణా శాఖ ఉన్నతోద్యోగి శ్యామ్‌నాయక్‌ ఉద్యోగాన్ని వదిలో ఓ ప్రధాన రాజకీయ పార్టీలో చేరగా... టీఎన్‌జీఓల సంఘం మామిళ్ల రాజేందర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఓ ప్రధాన పార్టీలో చేరనున్నారు.. అయితే గతంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులుగా సేవలు అందించారు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో కొలువులు వదులుకుని చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో పలువురు ఇలా ఉద్యోగాలను వదిలి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా ఇందులో నుంచి అయిదుగురు మంత్రులుగాను పనిచేశారు.


ఎన్టీఆర్‌ గుర్తించి..  టికెట్‌ కేటాయించి

బోథ్‌ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయుడుగా పనిచేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసింది గోడం రామారావు. 1983లో తెదేపా అధినేత ఎన్టీఆర్‌ జాతర్ల గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ  ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ దృష్టిలో పడటంతో తర్వాత జరిగిన 1985 ఎన్నికల్లో తెదేపా టికెట్‌ ఇచ్చారు. ఆయన గెలిచి గిరిజన సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 1989లో మరోసారి ఎన్నికయ్యారు.


క్రీడా పాఠశాల నుంచి..

బోథ్‌ మండలం నాగుగూడ గ్రామానికి చెందిన సోయం బాపురావు ఉట్నూరు క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయుడు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. తెరాస ఆవిర్భావ సమయంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా..

నార్నూర్‌ గ్రామానికి చెందిన ఆత్రం సక్కు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. 2009 వరకు ఉపాధ్యాయుడిగా కొనసాగారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగా.. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత భారాసలో చేరారు.


తండ్రి వారసుడిగా..

తండ్రి గోడం రామారావు వారసుడిగా ఆయన కుమారుడు గొడం నగేశ్‌ సైతం ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. బోథ్‌ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నగేశ్‌ ఉద్యోగాన్ని వదులుకుని తెదేపాలో చేరారు. 1994లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆతర్వాత 1999, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో పోటీ చేసినప్పటికి ఓటమి పాలయ్యారు. 2014లో ఎంపీగా గెలుపొందారు.


రాజకీయాలపై ఆసక్తితో..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బోథ్‌ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాథోడ్‌ బాపురావు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడే. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి తెరాస తరపున 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు.


ఆచార్యుడు.. మంత్రిగా సేవలు అందించి..

రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఒక గుర్తింపు పొందిన జీవీ సుధాకర్‌రావు ఉన్నత విద్యావంతుడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యులు. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలోనే అప్పటి సోషలిస్టు పార్టీ నేత రాంమనోహర్‌ లోహియా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణతో స్నేహం ఏర్పడి రాజకీయాల్లో అడుగుపెట్టారు.  1962, 1968, 1977లో ఇలా మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1977లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1983, 1985లో లక్షెట్టిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.


సబ్‌ రిజిస్ట్రార్‌ కాదని.. రాజకీయాల్లోకి వచ్చి..

ఉమ్మడి రాష్ట్రంలో చేనేత జౌళి శాఖల మంత్రిగా పనిచేసిన పడాల భూమన్న ఉన్నతోద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినవారే. ఆదిలాబాద్‌ సహకార సంఘం బ్యాంకులో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసున్న ఈయన రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1994లో ఆదిలాబాద్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999 ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసి గెలుపొంది మంత్రిగా సేవలు అందించారు.


కార్మిక శాఖ మంత్రిగా...

మాజీ మంత్రి బోడ జనార్దన్‌ రాజకీయాల్లోకి రాకముందు అటవీశాఖలో ఉద్యోగం చేశారు.  అటవీ సెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి తెదేపా తరఫున చెన్నూరు నుంచి 1985లో ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీచేసి వరుస విజయాలు సాధించారు. 1989కి ముందు తొమ్మిది నెలల పాటు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2003-04లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు.


జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్‌  నేత డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ప్రొహిబిషన్‌ అండ్‌ఎక్సైజ్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫును చెన్నూరు నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తెరాసలో చేరి ఎంపీగా గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని