logo

హలో.. హలోకు అనుమతి

మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్‌) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్‌టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి.

Published : 28 Mar 2024 02:55 IST

జిల్లాలో 62 బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నిర్మాణం
కాగజ్‌నగర్‌ గ్రామీణం, కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

కాగజ్‌నగర్‌ మండలం వంజీరి సమీపంలో కొనసాగుతున్న టవర్‌ నిర్మాణ పనులు 

మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్‌) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్‌టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. అటవీ, రెవెన్యూ అధికారుల ఉమ్మడి సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా.. ఇటీవల ఆ స్థలాల్లో నిర్మాణాలకు ఉత్తర్వులు నెం.262.23.ఎస్‌4 తేదీ 17-01-2024న వచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆదిలాబాద్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జి.జగోరాం ప్రకటించారు. దీంతో సంకేతాలు లేక కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్న గిరిజన గ్రామాల ఇబ్బందులు తొలగనున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌(భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) సెల్‌ టవర్ల మంజూరు...పనుల పురోగతిపై కథనం.

జిల్లాలోని పలు గిరిజన, గిరిజనేతర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో సంకేతాల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీ సేవలను విస్తరించాలనే సంకల్పంతో.. 62 సెల్‌ టవర్లను మంజూరు చేసింది. ఒక్కొక్క టవర్‌ నిర్మాణానికి దాదాపు రూ.1.30 కోట్లు కేటాయించింది. ఆసిఫాబాద్‌ మండలంలో 7, బెజ్జూరు-2, చింతలమానేపల్లి-1, దహెగాం-4, కాగజ్‌నగర్‌-5, కెరమెరి-12, కౌటాల-4, పెంచికల్‌పేట-3, రెబ్బెన-1, సిర్పూరు(టి)-4, తిర్యాణి-13, వాంకిడి-6 టవర్లు మంజూరయ్యాయి.

26 టవర్ల పనులు..

జిల్లాలోని వివిధ మండలాల్లోని 36 సెల్‌ టవర్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయించగా.. 26 టవర్ల స్థలాలకు అటవీ శాఖ అనుమతి పేరిట పనులు నిలిచి పోయాయి. రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలాల్లోని టవర్ల పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. మిగతా 26 సెల్‌ టవర్ల నిర్మాణానికి రెండు నెలల కిందట అటవీ అనుమతులు రాగా.. వాటి పనులను అధికారులు, గుత్తేదార్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ సెల్‌ టవర్లను సైతం నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రతి టవర్‌ వద్ద సోలార్‌ ప్లాంటుతోపాటు, అన్ని సదుపాయాలను కల్పిస్తూ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనుమతులు లభించిన టవర్ల నిర్మాణాలు ప్రారంభించి వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కాగజ్‌నగర్‌ మండలం కడంబాలో సిగ్నల్స్‌ లేక ఊరు బయట ఫోన్‌ మాట్లాడుతున్న యువకులు

జిల్లాలోని మారుమూల మండలాల్లోని పలు గ్రామాల్లో నేటికీ సంకేతాల సమస్య తీవ్రంగా ఉంది. తిర్యాణి మండలంలోని.. లింగాపూర్‌, లొద్దిగూడ, చిన్నదాంపూర్‌, కీమనాయక్‌ తండా, రాఘవపూర్‌, మోదీగూడ, పెంచికల్‌పేట మండలంలోని.. మొర్లిగూడ, జిల్లెడ, కొండపల్లి, దహెగాం మండలంలోని.. లోహ, మొట్లగూడ, రాంపూర్‌, దిగడ, కెరిమెరి, లింగాపూర్‌ మండలాల్లో సంకేతాలు అందక వృద్ధులు, దివ్యాంగులు ప్రతి నెలా పింఛన్ల కోసం ఇతర మండలాలు, గ్రామాలనూ ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కరించేందుకే ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను మంజూరు చేసింది.


త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు

జి.జగోరాం, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌

గిరిజన మారుమూల గ్రామాల్లోనూ సంకేతాల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెల్‌ టవర్ల నిర్మాణానికి రూ.కోట్లు కేటాయించింది. స్థల సమస్యతో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రసుత్తం అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. నిలిచిన పనులన్నింటినీ సత్వరమే ప్రారంభించి సకాలంలో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో ప్రారంభించిన టవర్ల పనులు దాదాపు పూర్తి కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని