logo

ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు

ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి.

Published : 28 Mar 2024 03:05 IST

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలకు సైతం ఉచిత విద్యుత్తు అందించాలని కొన్నిరోజుల నుంచి కోరుతున్న మేరకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం బడులకు, కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాలకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ఇటీవల నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించడం బడులకు ఉపశమనం కలిగించింది.

సరిపోని నిర్వహణ నిధులు

ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు ఏటా రెండు దశలుగా నిధులు సమకూరుస్తుంది. విద్యార్థుల ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తోంది. ఇందులో రూ.25 వేల వరకు వచ్చే పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. స్టేషనరీ కొనుగోలు, పలు కార్యక్రమాల నిర్వహణ, మరమ్మతులు, ల్యాబ్‌ నిర్వహణ, అంతర్జాలం, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, తాగునీరు, ఇతర సదుపాయాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఓసారి, ముగింపు లో మరోసారి నిధులు వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

రూ.కోటి వరకు బకాయిలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు అమలులో భాగంగా బకాయిల వివరాల సేకరణలో విద్యాశాఖ నిమగ్నమైంది. సుమారుగా రూ.1,77,07,474 విద్యుత్తు బిల్లుల బకాయిలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల రెగ్యులర్‌గా చెల్లిస్తుండగా మరికొన్ని చోట్ల బకాయిలు ఉన్నాయి. అక్కడక్కడా విద్యుత్తు మీటర్లు పని చేయకపోవడం, మరికొన్ని బడుల్లో అసలే విద్యుత్తు కనెక్షన్‌లు లేకుండా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 78 పాఠశాలు విద్యుత్తు మీటర్లు లేనివిగా ఉన్నట్టు గుర్తించారు.

పెరిగిన విద్యుత్తు వాడకం

పాఠశాలలకు కేటగిరీ-7ఏ కింద విద్యుత్తు మీటర్ల కనెక్షన్‌ ఇచ్చారు. నీటి అవసరాలకు మోటారు బోరు వినియోగం, తరగతి గదులు, ఉపాధ్యాయ గదుల్లో ఫ్యాన్లు, డిజిటల్‌ తరగతులు, ప్రొజెక్టర్లు వంటివి వినియోగిస్తారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల కల్పనలో భాగంగా ‘మన ఊరు మన బడి’ పథకంలో ఇంటరాక్టివ్‌ ప్యానెల్‌ బోర్డులను అందజేశారు. దీంతోపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఇటీవల కంప్యూటర్‌లు అందజేశారు. వీటన్నింటి వినియోగంతో విద్యుత్తు బిల్లులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో పాఠశాల సుమారు రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నాయని పలువురు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.


జిల్లా కేంద్రంలో 200కుపైగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతినెలా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు బిల్లు వస్తోంది. పాఠశాలకు ఒక్కో విడతలో రూ.30 వేల వరకు ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు అందుతున్నాయి. గతేడాది తొలివిడతలో అందిన నిధులతో సెప్టెంబరులో రూ.15,351 బిల్లు చెల్లించారు. వచ్చిన గ్రాంట్‌లో సగం విద్యుత్తు బిల్లుకే సరిపోతుంది. ఈ నెలలో పాఠశాలకు విద్యుత్తుశాఖ నుంచి అందిన బిల్లులో రూ.3095రాగా గత బకాయిలు కలుపుకుని మొత్తం రూ.27,361 చెల్లించాల్సి ఉంది. అయితే పాఠశాలకు విడుదలయిన నిధులు విద్యుత్తు బిల్లులకే అవుతుందని ఉచిత విద్యుత్తు అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఎంతో ప్రయోజనకరం

పోకల వెంకటేశ్వర్లు, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు

పాఠశాలలకు నిర్వహణ నిధులు సకాలంలో రాకపోవడం, వచ్చిన నిధులు సరిపోని కారణంగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బడుల నిర్వహణలో అన్నింటికి విద్యుత్తు వాడకం తప్పనిసరి. నిధులు లేమితో బకాయిలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్తు విషయం చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని