logo

‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు

పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి.

Published : 28 Mar 2024 03:33 IST

జిల్లాకు చేరుతున్న పరీక్ష పత్రాలు
న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం

మూల్యాంకనం జరిగేది ఇక్కడే

పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. జిల్లాకు 1.90 లక్షలు కేటాయించడంతో పరీక్షలు ముగిసేనాటికీ దశల వారీగా మూల్యాంకనం నిమిత్తం రానున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ఆదిలాబాద్‌ పట్టణంలోని సెయింట్ జోసెఫ్‌ కాన్వెంట్ హైస్కూల్‌ వేదికగా మూల్యాంకనం జరగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 53 పరీక్ష కేంద్రాల్లో 10,354 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 30తో ప్రధాన పరీక్షలు ముగియనుండగా.. మరో రెండు రోజుల్లో ఒకేషనల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫలితాలను సకాలంలో ప్రకటించేందుకు వీలుగా ఒక పక్క పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు జవాబుపత్రాలను మూల్యాంకనం కోసం ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. జిల్లాకు ఇతర జిల్లాల నుంచి ఇప్పటి వరకు జరిగిన తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌, గణితం విషయాలకు సంబంధించి 80 వేల జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరుకోగా.. పటిష్ఠ బందోబస్తు నడుమ వాటికి కోడింగ్‌ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాకు మూల్యాంకనం కోసం 1.90 లక్షల జవాబు పత్రాలు కేటాయించగా.. పరీక్షలు ముగిసేనాటికీ అవన్నీ రానున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి 11 వరకు ఉపాధ్యాయులు జవాబు పత్రాలు దిద్దుతారు. ఇందుకోసం ఇప్పటికే సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ డీఈవో ప్రణీత ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 3న మూల్యాంకన కేంద్రానికి ఉదయం 9 గంటలకు హాజరయ్యే సంబంధీకులను రిలీవ్‌ చేయాలని ఎంఈఓలు, హెచ్‌ఎంలకు ఆదేశాలు ఇచ్చారు.

843 మందికి బాధ్యతలు

జిల్లా విద్యాశాఖాధికారి క్యాంపు అధికారిగా, కార్యాలయ సహాయ సంచాలకులు(ఏడీ) నర్సిములు, పరీక్షల విభాగ సహాయ కమిషనరు వేణుగోపాల్‌రెడ్డి సహాయ క్యాంపు అధికారులుగా వ్యవహరించనున్నారు. పేపర్‌ కోడింగ్‌ అధికారులుగా 10 మంది పీజీహెచ్‌ఎంలను, వారికి సహాయకులుగా 30 మంది డైట్ ఛాత్రోపాధ్యాయులను నియమించి కోడింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. సహాయ మూల్యాంకన అధికారులు(ఏఈ)గా 527 మందిని, ముఖ్య మూల్యాంకన అధికారులు(సీఈ)గా 91 మందిని, ప్రత్యేక సహాయకులు(స్పెషల్‌ అసిస్టెంట్)గా 182 మంది ఉపాధ్యాయులకు ఆయా బాధ్యతలు అప్పగించారు.


ప్రక్రియ మొదలైంది

వేణుగోపాల్‌రెడ్డి, ఏసీ, పరీక్షల విభాగం

మూల్యాంకన కేంద్రానికి రోజువారీగా జవాబు పత్రాలు చేరుతున్నాయి. ఎప్పటికప్పుడు వాటికి కోడింగ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 3 నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే విధులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశాం. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు పహారా నడుమ సమాధాన పత్రాలు స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని