logo

గోదారి దాటొచ్చాం.. ఇక్కడ ఏదారీ లేదు!

మా ఇళ్లు కట్టేశారంటే గోదావరి దాటొచ్చాం. ఇక్కడ ఏదారి లేదంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా మలకపల్లి పోలవరం నిర్వాసితులు పలువురు ఏలూరు జిల్లా తాడువాయి పునరావాస కాలనీల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 05 Feb 2023 03:08 IST

మలకపల్లి నిర్వాసితుల ఆవేదన

తాడువాయి పునరావాస కాలనీ వద్ద మలకపల్లి నిర్వాసితులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: మా ఇళ్లు కట్టేశారంటే గోదావరి దాటొచ్చాం. ఇక్కడ ఏదారి లేదంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా మలకపల్లి పోలవరం నిర్వాసితులు పలువురు ఏలూరు జిల్లా తాడువాయి పునరావాస కాలనీల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్లు పూర్తయ్యాయని వరరామచంద్రాపురం తహసీల్దారు చెప్పడంతో శనివారం తాడువాయి వచ్చారు. అయితే వారికి కేటాయించిన ఇళ్ల నంబర్లకు క్షేత్రస్థాయిలో ఉన్న దానికి సంబంధం లేకపోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. కాలనీకి వెళ్లి చూసిరమ్మని పంపిన అక్కడి రెవెన్యూ అధికారులు తమను పట్టించుకోలేదని వాపోయారు. మా ఊరిలో ఉన్న గృహాలు వరదలకు పాడయ్యాయి. పాకలు వేసుకొని కాలం గడుపుతున్నాం. గోదావరికి మళ్లీ వరదలు వచ్చే లోగా ఇక్కడకు రావాలన్న ఆతృత మాది. ఇప్పటికి నాలుగు పర్యాయాలు వచ్చాం. మా బాధలు ఎవరికీ పట్టడం లేదు. ఏమి చేయాలో తెలియడం లేదని మలకపల్లి గ్రామ నిర్వాసితురాలు వెంకటరమణ తదితరులు వాపోయారు. ఈ విషయం నా దృష్టికి రాలేదని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఝాన్సీరాణి తెలిపారు. తాడువాయి నిర్వాసిత కాలనీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల పరిధిలో ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని