logo

జీతాల కోసం తప్పని నిరీక్షణ

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జనవరి నెల జీతాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది.

Published : 07 Feb 2023 03:43 IST

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జనవరి నెల జీతాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖలతోపాటు కొంతమంది ఒప్పంద ఉద్యోగులకు మాత్రమే ఈనెల ఆరో తేదీ సాయంత్రానికి జీతాలు జమ అయినట్లు తెలిసింది. ఈనెల ఒకటో తేదీన జీతాలు వస్తాయేమోనని ఉద్యోగులు ఎదురుచూశారు. కొన్ని కీలక శాఖలకు మినహా ఇతరులకు నేటికీ జమ కాకపోవడంతో వారంతా నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయ, ఉద్యోగులకు నేటికీ జీతాలు పడలేదు. జిల్లాలో ఒక్క గిరిజన సంక్షేమ విద్యాశాఖలోనే ఆరు వేల మంది వరకూ ఉపాధ్యాయులు ఉండగా.. ఇతర యాజమాన్యాల్లో మరో నాలుగు వేల మంది వరకు ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో చాలామంది వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకున్నారు. చాలా మంది ఐదో తేదీలోగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు పడకపోవడంతో ఈఎంఐలు చెల్లించేందుకు, ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోతోందని చెబుతున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో అదనపు రుణం మంజూరుపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు బయట అప్పులు తీసుకుని ఈవీఎంలు కడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వచ్చే మార్చితో ముగుస్తుంది. ఆదాయ పన్ను చెల్లించాలని ఉద్యోగులకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి. ఈ పరిస్థితుల్లో జీతాలు సక్రమంగా రాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ ప్రతి నెల జీతాలు సకాలంలో రాకపోవడంతో రుణాలు చెల్లించేందుకు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు