logo

జాబితాలో తప్పుల సవరణకే గ్రామసభలు

ప్రభుత్వం ప్రకటించిన నిర్వాసితుల జాబితాలో తప్పులేమైనా ఉంటే సరి చేసుకునేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చింతూరు ఎంపీడీఓ రవిబాబు పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

గ్రామసభలో మాట్లాడుతున్న చిన్నారెడ్డి

చింతూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించిన నిర్వాసితుల జాబితాలో తప్పులేమైనా ఉంటే సరి చేసుకునేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చింతూరు ఎంపీడీఓ రవిబాబు పేర్కొన్నారు. చింతూరు బీసీ కాలనీలో మంగళవారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి అర్హుల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలో జరిగే చర్చలతో జాబితాలు పూర్తయినట్లు కాదని తెలిపారు. జాబితాలో తప్పులు సరిచూసుకుని, ఎవరైనా జాబితాలో లేనివారు ఉంటే వారిని చేర్చి రీసర్వే నిర్వహిస్తామని పేర్కొన్నారు. చింతూరులో ఏడేళ్లుగా నివసిస్తున్నట్లు ఆధారాలు కలిగి ఉన్నవారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయి సర్వే అనంతరం అర్హుల జాబితాను ప్రకటించి ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేస్తుందని చెప్పారు. ప్రత్యేక ఉప కలెక్టర్‌ విక్టర్‌బాబు, తహసీల్దార్‌ సాయికృష్ణ, ఉప ఎంపీపీ సుధాకర్‌, ఎంపీపీ అమల, పంచాయితీ కార్యదర్శి ప్రసాద్‌ పాల్గొన్నారు.

అధికారులకు అవగాహన లేకుండా గ్రామసభలు నిర్వహిస్తున్నారని తెదేపా మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి విమర్శించారు. చింతూరు బీసీ కాలనీలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ప్యాకేజీ అందించాల్సిన బాద్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. నిర్వాసితులు ఎలాంటి ప్యాకేజీ అందుకుంటారో అధికారులు చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. ఒక అవగాహనతో గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు.


ఎవరికీ అన్యాయం జరగదు

కూనవరం, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల్లో అర్హత ఉన్న ఎవరికీ అన్యాయం జరగదని ప్రత్యేక ఉప కలెక్టర్‌ (ఎస్‌డీసీ) సుబ్బారావు భరోసా ఇచ్చారు. టేకులబోరులో నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామసభలో నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల అనుమానాలను నివృత్తి చేశారు. తాడ్వాయిలో ఇచ్చే ఇంటి స్థలాలను వెళ్లి చూసి రావచ్చన్నారు. అనంతరం ఎంపీపీ పాయం రంగమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా విజయ నిర్వాసితుల సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచి కట్టం రాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బండారు సాంబశివరావు, తహసీల్దార్‌ అనసూర్య పాల్గొన్నారు.


రాంగోపాలపురంలో పునరావాసం

వరరామచంద్రాపురం: చిన్నమట్టపల్లి పంచాయతీలోని గుంగువారిగూడెం, ప్రత్తిపాక గ్రామాల పోలవరం ముంపు నిర్వాసితులు ఎటపాక మండలంలోని రాంగోపాలపురంలో పునరావాసం పొందడానికి సుముఖంగా ఉన్నట్టు చిన్నమట్టపల్లి సర్పంచి పిట్టా రామారావు మంగళవారం తెలిపారు. ఆ గ్రామంలోని మూడు చోట్ల ఉన్న పొలాలను సోమవారం పరిశీలించామన్నారు. రెండు ముంపు గ్రామాల 334 కుటుంబాల అభిప్రాయం మేరకు తీర్మానం చేసి తహసీల్దార్‌, పంచాయతీ కార్యదర్శికి అందించామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని