కాళరాత్రిలో..భయానక క్షణాలు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు ఉన్నారు.
రైల్వే స్టేషన్‌లో రద్దీ నియంత్రణకు చర్యలు
న్యూస్‌టుడే, కార్పొరేషన్, గాజువాక, పెందుర్తి, ఎంవీపీకాలనీ, మాధవధార, తాటిచెట్లపాలెం, కంచరపాలెం: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు ఉన్నారు. వీరిలో క్షేమంగా బయటపడిన కొందరు శనివారం మధ్యాహ్నం విశాఖ వచ్చారు. ‘కళ్లు మూసి తెరిచే లోపు బోగీలు ఎగిరి పడ్డాయి. చీకటిగా ఉండడంతో ఏమి జరుగుతుందో తెలియలేదు..చుట్టూ హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఎటు చూసినా రక్తసిక్తం..ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోయింది. ప్రమాద దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. ఎంత మంది చనిపోయారో..ఎంత మంది బతికారో..కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక చాలా మంది విలపిస్తూ కనిపించార’ని ఆయా ప్రయాణికులు తెలిపారు.
ఈనాడు, విశాఖపట్నం, ఎంవీపీ కాలనీ, న్యూస్‌టుడే: ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉండిపోయారు. శ్రీకాకుళం మీదుగా భువనేశ్వర్, హావ్‌డా వైపు వెళ్లాల్సిన కొన్ని రైళ్లు నిలిపేయడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు స్టేషన్లోనే చాలా మంది స్తంభించిపోయారు. విశాఖ నుంచి బయలుదేరాల్సినవి, విశాఖ మీదుగా వెళ్లాల్సిన వాటిని తాత్కాలికంగా రద్దు చేయడంతో వేల మందికి నిరీక్షణ తప్పలేదు. రైల్వే స్టేషన్ మేనేజర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రయాణికులకు తగిన సహాయ సహకారాలు అందించాయి. ఆందోళనకు గురవ్వొద్దని ప్రత్యేక బృందాలతో అవగాహన కల్పించారు. గర్భిణులు, చంటిపిల్లలతో ఉన్న వారికి ప్రత్యేక సేవలందించారు. వృద్ధులు, మహిళలకు అవసరమైన ఆహారాన్ని ఉచితంగా అందించారు. నిత్యం విశాఖ మీదుగా 120 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం ప్రమాదం తరువాత సగానికిపైగా రైళ్లు ఆగిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారి వివరాలు తెలుసుకొని.. వారందరినీ సమీప ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో పంపించారు.
ఏ రైలు టికెట్ ఉన్నా వెళ్లేందుకు అవకాశం కల్పించారు. దీంతో శనివారం ఉదయం నాటికి 45 శాతం వరకు రద్దీని నియంత్రించగలిగారు. రైళ్ల రద్దు నేపథ్యంలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు పూర్తిస్థాయిలో డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఎగిరి కిందపడ్డాం..
మాది షాలిమార్. కుటుంబమంతా చైన్నెలో ఒక హోటల్‌లో వంటలు వండుతాం. మేము శుక్రవారం సాయంత్రం షాలిమార్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. రైలు ప్రమాదంతో ఒక్కసారిగా మేమంతా ఎగిరి కిందపడ్డాం. అసలు ఏమి జరిగిందో అర్ధం కాలేదు. స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు గంటన్నర పాటు బోగీలో ఉండిపోయాం. ఆ తర్వాత రైల్వే పోలీసులు వచ్చి సహాయక చర్యలు అందించారు. మాకు చికిత్స అందించి, ప్రత్యేక రైల్లో పంపించారు.
అరుణ్, రాణీ, అభిషేక్‌కుమార్, చాందిని
* రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి: రైలులో మరికొద్ది సేపట్లో పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంతలోనే ఒక్క కుదుపుతో బోగీలు పేకమీడలా ఒకదాని మీద ఒకటి పడ్డాయి. దీంతో కిందపడ్డ మాకు ఏం జరిగిందో తెలియదు. ప్రయాణికులు పెద్దగా కేకలు పెడుతూ కిందకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. మేముకూడా ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా వారితో పాటు కిందకు దిగిపోయాం. చూట్టూ చీకటిగా ఉంది. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బయటకు వచ్చేశాం. దేవుని దయవల్ల ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో చెన్నైకు బయలుదేరాం.
రాణి, చాందిని (తల్లీ కూతురు, బిహార్)
ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరికి వైద్యం
కోరమాండల్ రైలు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చించారు. ఆనందపురం మండలం మారికవలసకు చెందిన లోకేశ్వరరావు, మినిలు శనివారం ప్రత్యేక రైలులో విశాఖ చేరుకున్నారు. కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లోకేశ్వరరావుకు తలకు గాయమైందని, మినికి వెన్నెముకలో గాయమైనట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో వీరిద్దరు వైద్యం పొందుతున్నారు.
దుర్ఘటనలో భార్యాభర్తలకు గాయాలు
* ప్రమాదంలో ఆరిలోవకు చెందిన రాజు, అతని భార్య అరుణ గాయపడ్డారు. కోల్‌కతాలో ప్లాస్టిక్ పూలు కొనుగోలు చేసేందుకు వీరు ఈ రైలు ఎక్కారు. వీరు ఎక్కిన బోగి పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో రాజు చేయి, తలకు గాయమవగా.. అరుణకు ఛాతీకి దెబ్బ తగలింది. వీరు బాలేశ్వర్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
భయానకంగా ప్రమాద పరిసరాలు
విశాఖలోని మద్దిలపాలెం మాది. కుటుంబమంతా వారణాసి వెళ్లాం. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. అందరం క్షేమంగా బయటపడ్డాం. ప్రమాద పరిసరాలు భయానకంగా ఉన్నాయి. రక్తమోడుతున్న క్షతగాత్రుల అరుపులు వినిపించాయి. మా బోగి బీ2లో 1 నుంచి 12 బెర్తుల్లో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వ్యక్తి చిన్న బాలుడ్ని ఎత్తుకుని అలాగే మృతి చెంది ఉండడం చూసి నిర్ఘాంతపోయాం.
కె.శ్రీనివాసరావు, మద్దిలపాలెం
బోగీ తలకిందులైంది..
చెన్నైలోని కుటుంబ సభ్యులను కలిసేందుకు కోరమండల్ రైలులో వెళ్తున్నా. పెద్ద శబ్దంతో మేమున్న బోగి తలకిందులైంది. దుర్ఘటన స్థలంలో బోగిల నుంచి నిప్పురవ్వలు రాలి పడుతున్నాయి. గాయపడిన ప్రయాణికుల ఆర్తనాదాలు చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయా. నా 60ఏళ్ల జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదు. రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు భోజనం లేదు. ఎక్కడి వెళ్లాలి, ఎవరిని అడగాలో తెలియని దుస్థితి. జనరల్ బోగీలో ప్రయాణించడంతో మా పేర్లు నమోదు కాలేదు.
నౌజీ ఠాకూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన