logo

‘పోస్టల్‌ బ్యాలెట్‌’కు యంత్రాంగం కసరత్తు

పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 29 Mar 2024 02:44 IST

 పోస్టల్‌ బ్యాలెట్లు (పాత చిత్రం)

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతోపాటు మీడియా ప్రతినిధులకు, 85ఏళ్లు దాటి మంచానికే పరిమితమైన వయో వృద్ధులు, 40 శాతం పైబడి వైకల్య ఇబ్బందులు ఎదుర్కొంటూ కదల్లేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు, పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఇవ్వనున్నారు. ఎన్నికలేతర విధుల్లో ఉండే డ్రైవర్లు, నాలుగో తరగతి ఉద్యోగులనూ ఈ జాబితాలో చేర్చారు. 2019 ఎన్నికల్లో కేవలం ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతో పాటు సర్వీసు ఓటర్లకు మాత్రమే ఈ సదుపాయం కల్పించారు.

  • అప్పట్లో విశాఖ జిల్లాలో 15,000-17,000 మంది వరకు  వినియోగించుకున్నారు. ఈసారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఒక ఓటరు ఎమ్మెల్యేకు ఒకటి, ఎంపీకి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా పోలింగ్‌ సిబ్బంది సంఖ్య పెరిగింది. నిర్వహణకు దాదాపు 15వేల మంది ఉద్యోగులు అవసరం ఉందని అంచనా. ఈసీ అదనంగా అనుమతి ఇచ్చిన ఉద్యోగులు మరో 5 వేల మంది వరకు ఉంటారు. వీరితో పాటు సర్వీసు ఓటర్లు మరో నాలుగు వేల మంది ఉన్నారు.
  • వయోవృద్ధులు, దివ్యాంగులు వెరసి మరో పదివేలమంది వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా దాదాపు 30 వేల మందికి పైబడి పోస్టలు బ్యాలెట్లు వినియోగించుకునే వారు ఉంటారని అంచనా. ఎన్నికల విధులకు నియమితులయ్యే వారికి ఈనెలాఖరులో తొలి విడత శిక్షణ ఇస్తారు. రెండో విడత శిక్షణ నామపత్రాల ఘట్టం పూర్తి అయ్యాక ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ శిబిరం సమయంలో ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక వేళ ఇక్కడ ఇష్టం కాకుంటే అసెంబ్లీ, పార్లమెంటు ఆర్‌ఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే డ్రాప్‌ బాక్సుల్లో వేయొచ్చు.
  • ఎన్నికలు జిల్లాలో నాలుగో దశలో జరగనున్నాయి. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ రానుంది. 29వ తేదీతో నామపత్రాల గడువు పూర్తయి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తేలనున్నారు. ఆ తర్వాతే బ్యాలెట్‌ పేపర్‌ అందుబాటులోకి వస్తుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల వ్యవహార బాధ్యతలను జీవీఎంసీ అదనపు కమిషనర్‌ విశ్వనాథన్‌కు అప్పగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొనే వారు తమ ఓటు ఏ నియోజకవర్గం పరిధిలో ఉంది? పోలింగ్‌ కేంద్రం, వరస సంఖ్య వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని