logo

నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!

 విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌(ఎఫ్‌ఎస్‌ఎస్‌)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్‌యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది.

Updated : 29 Mar 2024 06:02 IST

షిప్‌యార్డులో ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌’ నిర్మాణ పనుల్లో జాప్యం

రెండింటిని ప్రైవేటు సంస్థకు అప్పగించినట్టు సమాచారం

పూర్తి చేయాల్సిన ఆర్డర్‌ ఫ్లీట్‌ సపోర్ట్‌ వెసల్‌

విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌(ఎఫ్‌ఎస్‌ఎస్‌)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్‌యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది.

ఎట్టకేలకు చేతికొచ్చే..: గతేడాదిలో అయిదు ఫ్లీట్‌ సపోర్ట్‌ వెసల్స్‌ నిర్మించే ఆర్డర్‌ను నామినేషన్‌ ప్రాతిపదికన రూ.19 వేల కోట్లకు షిప్‌యార్డు దక్కించుకుంది. ఈ మేరకు భారత నౌకాదళం, హిందుస్థాన్‌ షిప్‌యార్డు 2023 ఆగస్టు 25న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. షిప్‌యార్డు చరిత్రలో అత్యంత విలువైన ఆర్డర్‌గా పరిగణించి... అప్పట్లోనే సంస్థ యాజమాన్యం, కార్మికవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
 ఒప్పందం ప్రకారం అయిదు వెసల్స్‌ను 88 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. తొలి వెసల్‌ను 2027 ఆగస్టు నాటికి, మిగిలినవి అక్కడి నుంచి ప్రతి 10 నెలలకు ఒకటి చొప్పున పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది.

మౌలిక వసతులు కరవు..!: ఫ్లీట్‌ సపోర్ట్‌ వెసల్స్‌ను సకాలంలో పూర్తి చేయడానికి షిప్‌యార్డులో అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో... ఇప్పటివరకు వెసల్‌ నిర్మాణంలో తొలి అంకమైన ‘ప్లేట్‌ కటింగ్‌ ప్రొసెస్‌’ కూడా జరపలేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితేనే ‘కీలు లేయింగ్‌’ (పనుల ప్రారంభ పూజ) చేపట్టే  ఆస్కారం ఉంటుంది. వెసల్‌ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ దిగుమతిలోనూ జాప్యం జరుగుతోందని సమాచారం. మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రధాన సమస్యల్ని అధిగమిస్తేనే సకాలంలో ఆర్డర్ల పూర్తవుతాయని కార్మిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
2015లో తొలిసారిగా టర్కీకి చెందిన అనడోల్‌ కంపెనీ సాంకేతికత వినియోగించి, ఆ సంస్థతో కలిసి సంయుక్తంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ నిర్మాణానికి షిప్‌యార్డు యాజమాన్యం మొగ్గుచూపింది. అయితే అప్పటికే ఈ వెసల్స్‌ డిజైన్‌ పూర్తిగా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉందన్న కారణంతో నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రిత్విశాఖ స్వస్తి పలికింది.

రెండింటిని బదలాయించారా..?

భారత నౌకాదళానికి వెన్నుదన్నుగా నిలిచేలా రూపొందించాల్సిన ఫ్లీట్‌ సపోర్ట్‌ వెసల్స్‌ ఆర్డర్‌లో రెండింటిని మరో ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు షిప్‌యార్డు యాజమాన్యం నిర్ణయించినట్టు, ఆ మేరకు ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. ఈ ఒప్పందంపై ముద్రించిన కరపత్రాలు గతంలో షిప్‌యార్డు ప్రాంగణంలో కనిపించడంతో కలకలం రేగింది. ఇలాంటి పరిణామాలతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ముందుకొచ్చి వెసల్స్‌ నిర్మాణానికి పూర్తిస్థాయిలో చర్యలు ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
న్యూస్‌టుడే, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని