logo

భూముల రీసర్వేతో ఇబ్బందులు దూరం

శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం అమలు వేగవంతం చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రీసర్వే, ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్సు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూముల సర్వేపై దృష్టిసారించాలన్నారు

Published : 05 Oct 2022 01:49 IST

సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న జేసీ మహేష్‌కుమార్‌

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం అమలు వేగవంతం చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రీసర్వే, ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్సు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూముల సర్వేపై దృష్టిసారించాలన్నారు. భూకమతం ఒక సర్వే నెంబరులో ఉండి కాలక్రమేణా విభజన జరిగినా, చేతులు మారినా... సర్వే రికార్డులు అప్‌డేట్‌ చేయకపోవడంతో తలెత్తుతున్న  వివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు రీసర్వే ద్వారా పరిష్కారం కానున్నాయన్నారు. భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి భూకమతానికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించాలని సూచించారు. అన్ని వివరాలతో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూపటాన్ని భూమి యజమానులకు జారీ చేయాలని చెప్పారు. డివిజన్ల వారీ లక్ష్యాలను ఆర్టీవోలు, తహసీల్దార్లకు నిర్దేశించారు. రీసర్వేలో సాదాబైనామా, గ్రామ పురోణిలు, పోతి వంటివి తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. మొదట విడతగా వచ్చిన 1050, రెండో విడతగా వచ్చిన 5,000 భూమి హక్కు పత్రాలను సత్వరం తనిఖీ చేయాలని ఆదేశించారు. రీసర్వేకు సంబంధించి ఆరు మండలాల పరిధిలోని 100 గ్రామాల్లో నోటిఫికేషన్‌ పూర్తి చేశారని, మిగిలిన గ్రామాల్లో కూడా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ రాధిక, డిప్యూటీ తహసీల్దార్‌ సుభాష్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని