logo

వర్గోన్నతి సరే.. వసతులేవి..?

ఎన్నో ఏళ్ల తర్వాత గుడ్లవల్లేరు ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత-1 బడిగా వర్గోన్నతి కల్పించారు.

Published : 03 Dec 2022 04:52 IST

గుడ్లవల్లేరు-1 ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి

కిక్కిరిసి కూర్చున్న ఆరో తరగతి విద్యార్థులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్ల తర్వాత గుడ్లవల్లేరు ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత-1 బడిగా వర్గోన్నతి కల్పించారు. అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ స్థాయికి సరిపడా వసతులు, ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఇందులో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు 93 మంది ఉండగా ఉపాధ్యాయులు ఇద్దరే ఉన్నారు. గ్రామంలో ఎయిడెడ్‌, ప్రైవేట్‌ హైస్కూల్స్‌ మాత్రమే ఉండటంతో స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం కౌతవరం, అంగలూరుకు వెళ్తుండేవారు. దీంతో ప్రభుత్వపరంగా ఉన్నత పాఠశాల ఆవశ్యకతతో గతేడాది మధ్యలో దీన్ని ప్రాథమికోన్నతగా ఉన్నతీకరించారు. విద్యా సంవత్సరం మధ్యలో కావడంతో ఎవరూ చేరలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఆరో తరగతి విద్యార్థులు 36 మంది చేరడంతో విద్యార్థుల సంఖ్య 129 మందికి చేరింది. ఇక్కడ రెండు గదులు, ఒక వరండా ఉండడంతో గతంలో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆరో తరగతి విద్యార్థుల చేరికతో మరింత ఇరుకుగా మారింది. దీంతో పక్కనే ఉన్న ఎంఆర్‌సీ భవనంలోని భవిత కేంద్రాన్ని వేరే చోటుకు తరలించి ఇందులో తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా రెండు గదులే ఉండడంతో పిల్లలు తక్కువగా ఉన్న రెండు తరగతులకు కలిపి ఒకే గదిలో బోధిస్తున్నారు. ఎంఆర్‌సీలో పాఠ్య పుస్తకాల నిల్వకు, జేవీకే సామగ్రి భద్రపరచడం, ఉపాధ్యాయులకు సమావేశాల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు వారం రోజుల కిందట మండలంలోని కొన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ముగ్గుర్ని ఇక్కడికి డిప్యూటేషన్‌పై నియమించారు. తరగతి గదులు నిర్మించడం లేదు. మరుగుదొడ్లు మాత్రం కడుతున్నారు. పాఠశాలకు వర్గోన్నతి కల్పించినప్పుడే వసతులు, ఉపాధ్యాయుల నియామకం చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని